దాదాపు ఏడాది కిందటి నుంచినే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి వచ్చేసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కదనే ప్రచారం గట్టిగా సాగుతూ వచ్చింది. ఈ వ్యవహారంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు కానీ, స్థూలంగా మేకపాటి ఫ్యామిలీని పక్కన పెడతారనే ప్రచారం కానీ లేదు. మేకపాటి చంద్రశేఖర రెడ్డికి మాత్రమే టికెట్ దక్కదనే ప్రచారం సాగుతూ వచ్చింది.
2019 ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ దక్కలేదు. అయితే ఆయన తనయుడికి జగన్ టికెట్ విషయంలో భరోసా ఇచ్చి, పార్టీ ప్రభుత్వం వస్తే మంత్రి పదవి హామీని ఇచ్చారు. ఆ మేరకు మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ ఎమ్మెల్యేగా నెగ్గారు. మంత్రి పదవిని కూడా పొందారు. వివాదరహితుడు అయిన గౌతమ్ గుండెపోటుతో మరణించారు. ఆయన స్థానంలో రాజమోహన్ రెడ్డి మరో కుమారుడు విక్రమ్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో అవకాశం లభించింది. ప్రస్తుతం విక్రమ్ ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు.
మేకపాటి చంద్రశేఖర రెడ్డి వ్యవహారం తర్వాత గౌతమ్ స్పందిస్తూ.. పార్టీ లైన్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడాన్ని స్వాగతించారు. తాము జగన్ వెంటే ఉంటాం తప్ప, తమ బాబాయ్ తీరుతో తమకు సంబంధం లేదని విక్రమ్ స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయినా, మేకపాటి ఇంటి పేరును కానీ వదిలేసి వెళ్తే చంద్రశేఖర రెడ్డి అసలు శక్తి ఏమిటో తెలుస్తుందన్నారు. తాము అసంతృప్తితో ఉన్నట్టుగా, తాము పార్టీ వీడుతున్నట్టుగా ప్రచారం చేసే వారిని కుక్కలతో పోల్చారు విక్రమ్. 2024 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారు.