శేఖర్ సినిమాతో మళ్లీ బతికిన రాజశేఖర్

కెరీర్ లో ఇప్పటివరకు 90 సినిమాలు చేశారు రాజశేఖర్. 91వ సినిమాగా శేఖర్ అనే రీమేక్ ప్రాజెక్టు చేశారు. అయితే ఇది అన్ని సినిమాల్లాంటిది కాదు. రాజశేఖర్ కు ఎమోషనల్ గా బాగా కనెక్ట్…

కెరీర్ లో ఇప్పటివరకు 90 సినిమాలు చేశారు రాజశేఖర్. 91వ సినిమాగా శేఖర్ అనే రీమేక్ ప్రాజెక్టు చేశారు. అయితే ఇది అన్ని సినిమాల్లాంటిది కాదు. రాజశేఖర్ కు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిన సినిమా. ఈ సినిమాను తను జీవితంలో మరిచిపోలేనంటున్నాడు ఈ సీనియర్ నటుడు. దీనికి కారణం అతడికి కరోనా సోకడమే.

“నాకు కరోనా సోకింది. చావు వరకు వెళ్లిపోయాను. ముఖం పాడైపోయింది. కాళ్లు చేతులు కూడా లేపలేకపోయాను. ఫిజియోథెరపిస్టులు వచ్చి నా కాళ్లు, చేతులు కదిలించేవారు. ఇక నేను సినిమాలు చేయలేను అనుకున్నాను. శేఖర్ మూవీ రైట్స్ ను వేరే వాళ్లకు ఇచ్చేయమని చెప్పాను. కానీ జీవిత నమ్మింది. అన్నీ తానై ఈ సినిమాను బయటకు తెచ్చింది. నా జీవితంలో శేఖర్ సినిమాను మరిచిపోలేను. ఆ ఎటాచ్ మెంట్ అలాంటిది.”

ఇలా శేఖర్ సినిమాతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు రాజశేఖర్. 90 సినిమాలతోనే తన కెరీర్ ముగిసిపోతుందని అనుకున్నానని.. కానీ 91వ సినిమాగా శేఖర్ వస్తోందని చాలా ఎమోషనల్ అవుతూ చెప్పాడు. మరోవైపు ఈ సినిమాను జీవిత రాజశేఖర్ డైరక్ట్ చేయడం వెనక రీజన్ కూడా బయటపెట్టారు రాజశేఖర్.

“అదేంటో శేఖర్ మూవీ ముందు నుంచి నాకు ఎమోషనల్ అయిపోయింది. రీమేక్ అయినప్పటికీ చాలా అంశాలు జీవితతో డిస్కస్ చేశాను. ఎన్నో పాయింట్స్ తనకు చెప్పాను. ఇవన్నీ మరో వ్యక్తికి చెప్పి అతడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించే కంటే, జీవిత డైరక్ట్ చేస్తే కరెక్ట్ అనిపించింది.”

మలయాళంలో హిట్టయిన జోసెఫ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది శేఖర్. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఫిబ్రవరి మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.