ఈ కక్షసాధింపు మాటలే కొంప ముంచుతున్నాయా?

పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారనేది టీడీపీ వాదన, పోలీసుల అండ చూసుకుని వైసీపీ నేతలు దారుణాలకు పాల్పడుతున్నారనేది కూడా వారి ఆరోపణ. అలాంటప్పుడు టీడీపీ ఏం చేయాలి, కానీ ఇప్పుడు ఏం చేస్తోంది, టీడీపీ…

పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారనేది టీడీపీ వాదన, పోలీసుల అండ చూసుకుని వైసీపీ నేతలు దారుణాలకు పాల్పడుతున్నారనేది కూడా వారి ఆరోపణ. అలాంటప్పుడు టీడీపీ ఏం చేయాలి, కానీ ఇప్పుడు ఏం చేస్తోంది, టీడీపీ నాయకుల ధోరణి ఎలా ఉంది..?

“2024లో మేం అధికారంలోకి తప్పకుండా వస్తాం, ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటాం, ఎవ్వర్నీ వదిలిపెట్టం, అన్నీ లెక్కలు రాసుకుంటున్నాం..” ఇదీ వారి వితండవాదం.

పోనీ వైసీపీ వాళ్లు తప్పులే చేశారనుకుందాం. మరి టీడీపీ అధికారంలోకి వచ్చాక చేస్తామంటోంది ఏంటి..? అవే తప్పుల్ని మరింత ఎక్కువగా చేస్తామంటూ సవాళ్లు విసురుతోంది. అలాంటప్పుడు టీడీపీని అధికారంలోకి తేవడం ఎందుకు? కనీసం ఈ లాజిక్ అయినా వారు ఆలోచించారా..? ఈ వాదన జనంలో నిలబడదు కూడా. జనం ఇప్పటికే టీడీపీ సవాళ్లను అసహ్యించుకుంటున్నారు. అంతకంతకూ బదులు తీరుస్తామనే వారి మాటలు వారి పైత్యాన్ని బయటపెడుతున్నాయే కానీ, సింపతీని పెంచేందుకు పనికి రావడంలేదు.

మీరు కొట్టారు తీసుకున్నాం, మేం అధికారంలోకి వచ్చాక బలంగా కొడతామన్నారు జగన్. ఇందులో కసి ఉంది కానీ, కక్షలు, కార్పణ్యాలు కనిపించవు. ఇందులో మనోవేదన ఉంది కానీ, రివేంజ్ డ్రామా లేదు. కానీ టీడీపీ నేతలు ఇప్పుడు చేస్తున్న సవాళ్లలో మాత్రం అవన్నీ కనపడుతున్నాయి. లోకేష్, అచ్చెన్నాయుడు, ఆఖరికి చంద్రబాబు కూడా రివేంజ్ తీర్చుకుంటామనే మాటలు పదే పదే వాడుతున్నారు.

లోకేష్, అచ్చెన్న ఎప్పుడూ జేబులో పేపర్, పెన్ను పెట్టుకున్నట్టు.. రాస్తున్నాం, అన్నీ రాసుకుంటున్నాం, ప్రతి ఒక్కరి పేరు లిస్ట్ లో ఉంది అంటూ.. చిత్రగుప్తుల్లా రెచ్చిపోతున్నారు. ఇలా లిస్ట్ రాసిపెట్టుకుంటున్నాం, బదులు తీర్చుకుంటామంటూ అధికారుల్ని, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తే ఫలితం ఏంటి..? ఎవరు ఓట్లు వేస్తారు, ఎందుకు వేస్తారు.

టీడీపీ అధికారంలోకి వస్తే కష్టం అనుకున్నవారంతా ఇప్పటినుంచే వారికి వ్యతిరేకంగా మారిపోతారు కదా. మరి చంద్రబాబుకి ఈ లాజిక్ తట్టలేదా..? లేక ఫ్రస్టేషన్లో ఉన్న టీడీపీ వర్గం, కార్యకర్తల్లో ధైర్యం నూరిపోసేందుకు ఈ ప్రతీకారం, ఉప్పు-కారం డైలాగులు కొడుతుందా.. అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద ఈ తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు టీడీపీకి మరింత డ్యామేజీగా మారుతున్నాయనేది మాత్రం వాస్తవం.