జగన్ కేబినెట్ లో నోరున్న నేతలు ఎవరు..? ప్రతిపక్షాలను విమర్శలతో చీల్చి చెండాడే నాయకులు ఎవరు..? మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అప్పుడప్పుడూ బొత్స, ఎమ్మెల్యేలలో అంబటి.. వీళ్లలో జగన్ సామాజిక వర్గం ఎవరూ లేరు. అసలు జగన్ పై మాట పడితే ముందుగా దూసుకొచ్చేది వీరే.
కనీసం ఆయన సొంత సామాజిక వర్గం ఆయన దగ్గర్లో కూడా లేదు. అడపా దడపా పెద్దిరెడ్డి, రోజా ఫామ్ లోకి వచ్చినా.. వీళ్లు ఫుల్ లెంగ్త్ బ్యాట్స్ మెన్ కాదు. ఇటీవల ప్రసన్నకుమార్ రెడ్డి వంటి నేతలు సడన్ ఎంట్రీ ఇచ్చినా.. ఆయన చేసిన వ్యాఖ్యలకు కనీసం ఎవరూ మద్దకు కూడా ఇవ్వలేదు. అసలు సొంత పార్టీ నుంచి కూడా ఆయన్ని ఎవరూ సపోర్ట్ చేయలేదు.
జగన్ వర్గం ఎక్కడ..? ఏం చేస్తోంది..?
దాదాపుగా ప్రతి పార్టీలోనూ అధినేత సామాజిక వర్గానికి చెందినవారు ఓ కోటరీలాగా ఆయన చుట్టూ ఉంటారు. ఆయనపై పల్లెత్తు మాట పడకుండా చూసుకుంటుంటారు. కానీ వైసీపీలో మాత్రం జగన్ సామాజిక వర్గం కొంతవరకే పరిమితం అయింది. వాస్తవానికి జగన్ కి ఏ కోటరీ లేదు. ఆయన చుట్టూ ఉన్నవారిలో అన్ని సామాజిక వర్గాల వారూ ఉన్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపు కాదు. వైఎస్ఆర్ చుట్టూ అప్పట్లో ఆయన సామాజిక వర్గం నేతలు బలంగా నిలబడ్డారు. కానీ జగన్ హయాం వచ్చే సరికి వారెవరూ దరిదాపుల్లో లేరు.
మంచికా.. చెడుకా..?
ఏపీలో కులరాజకీయాలు బలంగా ఉన్నాయనే వాదన ఉంది. టీడీపీ పూర్తిగా కులం కార్డునే వాడుతోంది, జనసేన కూడా ఆ వైపు వెళ్లాలని చూస్తున్నా లాభం లేదేమోననే మీమాంసలో ఉంది. కాంగ్రెస్ కూడా కాపుల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ దింపుడు కళ్లెం జోకులు పేలుస్తోంది. బీజేపీకి ఎటూ వెళ్లే అవకాశం లేదు, అందుకే మత రాజకీయాలని నమ్ముకోవాలని చూస్తోంది.
వైసీపీ విషయానికొస్తే… జగన్, సొంత సామాజిక వర్గానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు, అందుకే ఆయన అందరివాడయ్యారు, ఆయన చుట్టూ అందరూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధినేతని ఎవరైనా టార్గెట్ చేస్తే మిగతావర్గాల నుంచి వచ్చినంత స్పందన.. సొంత సామాజిక వర్గం నుంచి కనిపించకపోవడం మాత్రం విశేషం. జగన్ హయాంలో నోరున్న నేతలెవరు అంటే, టాప్ 5లో ఆయన సొంత సామాజిక వర్గం నుంచి ఒక్కరూ లేకపోవడం విచిత్రం.