ఈ దఫా నందమూరి వారి సంక్రాంతి వేడుక వేదిక మారింది. నందమూరి బాలకృష్ణ తన కుటుంబంతో తెలుగు వారి మొదటి పండుగను సంతోషంగా నిర్వహించేందుకు సోదరి పురందేశ్వరి ఇంటికి వెళ్లడం గమనార్హం. అక్కాబావలైన పురందేశ్వరి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేసేందుకు బాలయ్య గురువారమే తన కుటుంబంతో కలిసి కారంచేడు వెళ్లడం విశేషం.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి స్వస్థలం నారావారిపల్లెలో గత కొన్నేళ్లుగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. ఈ పండుగకు చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పాల్గొనేవారు. అయితే రెండేళ్లుగా కరోనా మహమ్మారి, అధికార మార్పిడి తదితర కారణాలతో చంద్రబాబు నారావారిపల్లెలో సంక్రాంతి జరుపుకునేందుకు వెళ్లడం లేదు.
దీంతో నారావారిపల్లెలో ఒకప్పటి సంక్రాంతి వెలుగులు లేవు. ఊర్లో కళ తప్పింది. రాజకీయ, సినీ తదితర సెలబ్రిటీల రాకకు నోచుకోక నారావారిపల్లె సంక్రాంతి శోభకు నోచుకోలేదు. ప్రస్తుతం ఊరంతా బోసిపోయింది. కానీ బాలయ్య మాత్రం పండుగను సోదరి భువనేశ్వరి ఇంట కాకుండా మరో అక్క పురందేశ్వరి కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు నిర్ణయించుకోవడం విశేషం.
పురందేశ్వరి బీజేపీలో కీలక నాయకురాలు. ఆ పార్టీ జాతీయ స్థాయిలో గత ఏడెనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకూ పురందేశ్వరి ఆ పార్టీలోనే ఉన్నారు. అంటే పురందేశ్వరి దాదాపు రెండు దశాబ్దాలుగా అధికార పార్టీలో కొనసాగుతున్నట్టైంది.