భోగి మంటల్లో సైతం రాజకీయ చలిని నారా లోకేశ్ కాచుకున్నారు. కాదేదీ కవితకు అనర్హమన్నట్టు పండుగ కూడా రాజకీయ స్వార్థానికి అతీతం కాదని లోకేశ్ నిరూపించారు. మంచీచెడు అనే విచక్షణ లేకుండా ప్రతిదీ ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ముడిపెడుతూ టీడీపీ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది.
తాజాగా భోగిని రాజకీయంగా ఎంత బాగా వాడుకోవచ్చో నారా లోకేశ్ తన ట్వీట్‌తో చాటి చెప్పారు. భోగిని పురస్కరించుకుని, పరోక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని తగలబెట్టడం వల్లే జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోవచ్చనే సందేశాన్ని ఆయన పంపారు. ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.
“కొత్త వాటికి, మేలు చేసే వాటికీ ఇంట్లో చోటిమ్మని చెబుతోంది భోగి పండుగ అని… వస్తువులకే కాదు ప్రభుత్వాలకైనా అదే సూత్రం వర్తిస్తుందన్నారు. అప్పుడే జన జీవితాలకు కొత్త వెలుగులు వస్తాయని తెలిపారు. సంక్రాంతికి స్వాగతం పలుకుతూ సంబరాల కాంతిని వెదజల్లే భోగిమంటలు మన కష్టాలను హరించాలి” అని లోకేశ్ ఆకాంక్షించారు.
గతంలో ఇలా కొత్త వాటికి, మేలు చేసే వాటికీ ఇంట్లో చోటివ్వాలనే ఉద్దేశంతోనే టీడీపీని ఓడగొట్టారని లోకేశ్ ట్వీట్‌ను బట్టి అర్థం చేసుకోవాలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కనీసం పండుగ రోజైనా రాజకీయాలకు అతీతంగా, హూందాగా లోకేశ్ వ్యవహరించి వుంటే బాగుండేదని రాజకీయ విమర్శకులు అంటున్నారు.