కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మధ్య రోజురోజుకూ అగాథం పెరుగుతోంది. ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వర్గీయులపై గురువారం అర్ధరాత్రి ఎమ్మెల్యే వర్గీయులు భౌతిక దాడికి తెగబడ్డారు. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఆర్వీ రమేశ్ యాదవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు చెబుతూ మూడు రోజులుగా ప్రొద్దు టూరులో ప్లెక్సీలు కడుతున్నారు. దీన్ని ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు జీర్ణించుకోలేకున్నారు.
ప్రొద్దుటూరులో రానున్న రోజుల్లో తమకెక్కడ ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుగుతాడోననే అక్కసు రమేశ్ యాదవ్‌పై ఎమ్మెల్యే వర్గీయులు పెంచుకున్నారనే చర్చ పట్టణంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ నాయకుడైన ఎమ్మెల్యే రాచమల్లు ఫొటో పెట్టలేదనే కోపంతో ఎమ్మెల్సీ వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇటీవల ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా తమ నాయకుడైన రమేశ్ యాదవ్ ఫొటో పెట్టని విషయాన్ని ఎమ్మెల్సీ వర్గీయులు గుర్తు చేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ వర్గీయుడు రఘునాథరెడ్డిపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి పాల్పడడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇతని పేరుతో పట్టణంలో భారీగా ప్లెక్సీలు ప్రత్యక్షం కావడం గమనార్హం. అంతటితో ఎమ్మెల్యే వర్గీయుల ఆగడాలు ఆగలేదు. ఎమ్మెల్సీ నివాసం( కార్యాలయం కూడా) ఉంటున్న శ్రీరాములపేటలో కూడా ఇవాళ తెల్లవారుజామున ఎమ్మెల్యే వర్గీయులు రమేశ్ యాదవ్‌కు సంబంధించిన ప్లెక్సీలను చించివేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ వర్గీయులు రగిలిపోతున్నారు.
బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే తలంపుతో సీఎం జగన్ తన జిల్లాకు చెందిన రమేశ్ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ కిందిస్థాయిలో మాత్రం తమకు సమాంతరంగా అణగారిన వర్గాల వారిని ప్రోత్సహించడంపై ఎమ్మెల్యే ఓర్వలేకున్నారని ఎమ్మెల్సీతో పాటు ఆయన అనుచరులు వాపోతున్నారు.
ఇదిలా వుండగా ఎమ్మెల్సీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రొద్దుటూరులో పెట్టిన ప్లెక్సీల చించివేత, అలాగే అనుచరులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో బలమైన నాయకుడైన రాచమల్లును నేరుగా ఎదుర్కోలేక పోవచ్చని, ఎన్నికల్లో మాత్రం గట్టిగా బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న విభేదాలు …తాజా ఘటనతో బట్టబయలు అయ్యాయి.