చిత్ర పరిశ్రమ సమస్యలపై కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కడితోనే సీఎం జగన్ చర్చించడంపై వ్యూహాత్మకంగా టీడీపీ దాడికి దిగింది. సీఎంపై దాడికి తన అనధికార మిత్రుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను టీడీపీ రంగంలోకి దింపిందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఏపీ ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య నెలకున్న వివాదంపై రామకృష్ణ తన మార్క్ హితవు, పంచ్ విసిరారు.
సినిమా టికెట్ల ధరలకు సంబంధించి వైసీపీ నేతలు, సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు పరస్పరం దూషించుకోవడం సబబు కాదన్నారు. సినిమా అసోసియేషన్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపాలని కోరారు.
అంతే తప్ప, సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులతో విడివిడిగా చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదన్నారు. సినిమా ఆర్టిస్ట్స్, డైరెక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లు, థియేటర్ల యాజమాన్యాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపితేనే ప్రయోజనం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవితో గురువారం సీఎం జగన్ చర్చలు జరపడాన్ని రామకృష్ణ పరోక్షంగా తప్పు పట్టారు. ఇలాంటి చర్చల వల్ల చిత్ర పరిశ్రమకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆయన చెప్పకనే చెప్పారు. సాధారణంగా తాను విమర్శించడానికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశాలపై రామకృష్ణను టీడీపీ బరిలో దింపుతుంటుందనే వాదనకు ఇది బలం కలిగిస్తోంది.