మూవీ రివ్యూ: బంగార్రాజు

టైటిల్: బంగార్రాజు రేటింగ్: 2.5/5 తారాగణం: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజి, రావు రమేష్, సంపత్ తదితరులు కెమెరా: యువరాజ్ ఎడిటింగ్: విజయ్ వర్ధన్ సంగీతం: అనూప్…

టైటిల్: బంగార్రాజు
రేటింగ్: 2.5/5
తారాగణం: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజి, రావు రమేష్, సంపత్ తదితరులు
కెమెరా: యువరాజ్
ఎడిటింగ్: విజయ్ వర్ధన్
సంగీతం: అనూప్ రూబెన్స్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
నిర్మాత: అక్కినేని నాగార్జున
కథ-దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
విడుదల తేదీ: 14 జనవరి 2022

“సొగ్గాడే చిన్ని నాయనా” కి సీక్వెల్ గా తయారైన “బంగార్రాజు” పక్కా సంక్రాంతి సినిమా అని ట్రైలరు, విడుదలైన పాటలు ముందుగానే చెప్పేసాయి. ఈ సీజన్లో ఇలాంటి సినిమాలకి సాధారణంగా గిరాకీ ఉంటుంది. 

పల్లెటూరి నేపథ్యం, కుటుంబ వాతావరణం, ఓణీల్లో అమ్మాయిలు, రంగవల్లి ముగ్గులు, ఆటలాడుకునే పిల్లలు, కుటుంబ విలువలు, ప్రేమానుబంధాలు, కామెడీ ..ఇలాంటి దినుసులన్నీ రంగరించి తీసే సినిమాలు మామూలు రోజుల్లో ఏమో గానీ సంక్రాంతికి మాత్రం ఆడేయడం ఒక రివాజు. 

అదే కోవలో తయారైన ఈ సినిమాని కరోనా ఇబ్బందులున్నా, ఒక రాష్ట్రంలో టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ రాకపోయినా వెనుకంజవేయకుండా సంక్రాంతి పుంజులాగ బరిలోకి దింపారు. 

విషయమెలా ఉందో చూద్దాం. 

ఈ చిత్రం చూసేవాళ్లు “సొగ్గాడే చిన్ని నాయనా” చూసినా చూడకపోయినా పర్వాలేదు. పేరుకి సీక్వెలే అయినా అది చూడకపోతే ఇది అర్థం కాదేమోనన్న అనుమానాలక్కర్లేదు. 

బంగార్రాజు ఆత్మ స్వర్గానికి చేరడంతో కథ మొదలౌతుంది. అతని మనవడుగా అవే లక్షణాలతో జూనియర్ బంగార్రాజు పుడతాడు. ఆ ఊరిలో గుడి, దాని కిందొక నిధి…దాని మీద విలన్ల కళ్లు..చివరికి మనవడిని కాపాడుకునే పనిలో గుడిని కూడా కాపాడిన బంగార్రాజు ఆత్మ. ఇదీ క్లుప్తంగా కథ. 

ముందుగా చెప్పుకోవల్సింది స్క్రీన్ ప్లే గురించి. ఉన్నంతలో కాస్త సస్పెన్స్, ఎప్పుడు ఏ పాత్రని రివీల్ చెయ్యాలో ఆ పాత్రని రివీల్ చేస్తూ కథనం బోర్ కొట్టకుండా సాగింది. అయినా కూడా కథలో చెప్పిన గుడి కింద నిధి విషయం పక్కకు పోయి ప్రేమకథ మీదే కథనం ఎక్కువగా నడిచింది. 

అయితే ఇలాంటి సినిమాల్లో అద్భుతమైన కామెడీని పండించే ట్రాక్స్ రాసుకోవచ్చు. దానిని పూర్తిగా గాలికొదిలేసారు. చాలా చోట్ల సన్నివేశం నిడివి కావొచ్చు, డయలాగులో పవర్ లేకపోవడం వల్ల కావచ్చు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తేలిపోవడం వల్ల కావొచ్చు…అందాల్సిన అనుభూతి అందదు. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో కలగాల్సిన రోమాంఛన అనుభూతి కలగదన్నమాట. 

స్వర్గాధిపతి ఇంద్రుడు, నరకాధిపతి యముడు ఇద్దరూ ఏ మెరుపులూ లేకుండా విగ్రహపుష్టి నైవేద్య నష్టి లాగున్నారు. ఆ పాత్రలని అలా నీరసంగా వదిలేసిన క్రెడిట్ దర్శకుడిదే. 

పైగా విలన్ ట్రాక్ పరమ వీక్. చాలా కృతకంగా ఉండి బలవంతంగా ఇరికించినట్టు ఉంది. ఆత్మతో వ్యవహారం కాబట్టి తాంత్రిక విలన్ ని పెట్టడం సమంజసమే అనుకున్నా దానిని మలచిన విధానం బలంగా లేదు. 

ఇక జంట ఆత్మలు అలా మాటిమాటికీ కనపడడం కూడా ఎబ్బెట్టుగానో, అడ్డంగానో అనిపిస్తుంది. 

“సొగ్గాడే…” లో ఒక అనసూయ, ఒక హంసానందిని ని ఫొకస్డ్ గా పెట్టారు. ప్రేక్షకుల దృష్టి వాళ్లమీద నిలిచింది. ఇప్పుడిందులో ఎవరెవరో వస్తుంటారు. కానీ ఎవరూ దృష్టిలో నిలవరు. 

దర్శకుడు వంటకి కావాల్సిన దినుసులన్నీ సమకూర్చున్నాడు కానీ ఏది ఎంత వేయాలో, ఏది ఎప్పుడు తగిలించాలో తెలియక తడబడ్డాడు. మధ్యమధ్యలో రుచి చూస్తూ, తేడా వస్తే కలపాల్సినివి కలుపుతూ వండితేనే తయారవుతుంది సరైన పిండివంటైనా, సినిమా అయినా. ఇక్కడా కసరత్తు జరిగినట్టు కనపించలేదు. దినుసులున్నీ కుక్కర్లో పాడేసి ఏదో కిచిడీ వండినట్టు వండేసినట్టుంది. 

ఇలాంటి ఎత్తుపల్లాలెన్నున్నా క్లైమాక్స్ కి వచ్చే సరికి అర్థవంతంగా ముగిసింది. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం ద్వారా ఉన్నంతలో కుటుంబ బంధాలమీద చిన్న మెసేజ్ కూడా ఇచ్చేసారు. అది కూడా మారీ రుద్దినట్టు కాకుండా పొందిగ్గా అతికినట్టే ఉంది. 

టెక్నికల్ గా సినిమా బలంగానే ఉంది. కెమెరా పనితనం నుంచి గ్రాఫిక్స్, ఎడిటింగ్ వరకు అన్ని శాఖలూ తమ పని బాగానే చేసాయి. 

ఎటొచ్చీ పైన చెప్పుకున్న ఇబ్బందులున్నాయి. 

పాటలు మాత్రం మాస్ ఆడియన్స్ ని అలరిస్తాయి. ఫారియా అబ్దుల్లా ఒక పాటలోనూ, దక్ష నగర్కర్ సగం పాటలోనూ అలరించారు. వీటిల్లో ఫారియా పాట సెకండాఫులో మంచి ఊపునిచ్చింది. 

“సొగ్గాడే చిన్ని నాయనా” లోని పాత్రలతో యథాతథంగా నాగార్జున ద్విపాత్రాభినయంతో వైవిధ్యం చాటుకున్నారు. 

నాగ చైతన్య కూడా తన పాత్ర వరకు న్యాయం చేసినట్టే. అయితే తాను పూర్తిగా ఇలాంటి సినిమాని మోయలేడు. బలమైన ప్యాడింగ్ అవసరం. అది లేని లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 

కృతిశెట్టి పాత్ర సరదాగా మలచబడింది. రమ్యకృష్ణ మునుపటికంటే వయసుమీదపడినట్టు కనిపించింది. 

ఈ చిత్రంలో దర్శకుడు కల్యాణ్ కృష్ణ మంచి ఐటం సాంగ్ రాసారు. ఆ పాట బాణీలో ఆయనకొక విషయం చెప్పాలి: 

“ఎట్టపడితె అట్ట తీస్తె బంగర్రాజు…మేము చూసేది ఎట్టాగ పండగ రోజు; ఇంకాస్త దృష్టి పెడితె బంగార్రాజు..పెట్టెవాడివయ్య హిట్టు కొట్టి సక్సెస్ పోజు”

ఆద్యంతం వినోదాత్మకం అని చెప్పడం కష్టం కానీ… పెద్దగా బోర్ కొట్టని, ఇబ్బంది పెట్టని సినిమా అని మాత్రం చెప్పొచ్చు. ఈ “బంగార్రాజు” మరీ మేలిమి బంగారమూ కాదు…అలాగని గిల్టు బంగారం కూడా కాదు. 

బాటం లైన్: మెరుపు తగ్గిన బంగారం