ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం చేసినా ప్రతిపక్షాలు బురదజల్లుతూనే వుంటాయని వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రోజా కడప జిల్లా శెట్టిపాలేనికి వెళ్లాను. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కావడం శుభపరిణామమన్నారు. చిత్ర పరిశ్రమ చెప్పినదాంట్లో న్యాయం ఉందనిపిస్తే …జగన్ మంచి చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రజానీకం శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని జగన్ మంచి కార్యక్రమాలు చేపడితే… ప్రతిపక్షాలు చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాయని ఆమె ఉదాహరణలు చెప్పారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడితే అడ్డంకులు సృష్టించడాన్ని రోజా గుర్తు చేశారు. కళాశాలల ఫీజులు తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్యలంటూ గగ్గోలు పెట్టారని విమర్శించారు.
అలాగే కోవిడ్ ట్రీట్మెంట్కు భారీగా ఫీజులు వసూలు చేస్తుంటే, కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినపుడు కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారన్నారు. ప్రస్తుతం సినిమా టికెట్ల విషయంలోనూ అలాగే విమర్శిస్తున్నారని రోజా మండిపడ్డారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలనే ఉద్దేశమే తప్ప మరొకటి ఉండదన్నారు.
చిత్రపరిశ్రమ సమస్యలుంటే చిరంజీవిలా ముందుకొచ్చి ప్రభుత్వంతో చెప్పుకోవచ్చన్నారు. అంతే కానీ, రెచ్చగొట్టేలా మాట్లాడకూ డదని రోజా హితవు చెప్పారు. బిజీ షెడ్యూల్లో కూడా చిత్రపరిశ్రమ గురించి సీఎం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని రోజా అన్నారు. సీఎం ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ముందుకెళుతున్నారే తప్ప, మరెవరిపైన్నో కక్ష సాధించేందుకు ఎంత మాత్రం కాదని రోజా స్పష్టం చేశారు.