కేరళలో ఓ నన్‌పై బిషప్ అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో బిషప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కొట్టాయం తీర్పు వెలువరించింది. దేశంలోనే తీవ్ర సంచలనం రేకెత్తించిన కేసుకు సంబంధించి బాధితురాలి ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంటూ… బిషప్‌ను నిర్దోషిగా ప్రకటించడం గమనార్హం. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
జలంధర్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చ్‌లో బిషప్‌గా ఉన్న ఫ్రాంకో ములక్కల్‌పై 2018లో కేరళకు చెందిన ఓ 45 ఏళ్ల నన్ లైంగిక ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
“కురివిలంగద్లోని మా కాన్వెంట్కు 2014లో బిషప్ ఫ్రాంకో ములక్కల్ వచ్చాడు. అప్పుడు రాత్రి వేళ బిషప్ నన్ను తన గదికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా 2014-16 మధ్య కాలంలో అనేకమార్లు నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కానీ, 2018లో బిషప్ నన్ను, నా కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు” అని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో సదరు బాధిత నన్ పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అత్యాచారం కేసులో అరెస్టయిన భారతదేశంలోని తొలి క్యాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ కావడం గమనార్హం. మరోవైపు పోలీసులు, ప్రభుత్వం వెంటనే బిషప్‌పై చర్యలు తీసుకోవాలంటూ నన్‌లు కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణకు కేరళ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో 2018, సెప్టెంబర్‌లో బిషప్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏడాదికి కేసు విచారణ మొదలైంది. తనపై వచ్చిన ఆరోపణలను బిషన్ న్యాయస్థానంలో ఖండించారు. అత్యాచారం జరిగిందని ఆరోపించిన తేదీల్లో అసలు తాను కురివిలంగద్లోని కాన్వెంట్లో బస చేయలేదని బిషప్ గట్టిగా తన వాదనను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న కొట్టాయం అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు బిషప్‌ను నిర్దోషిగా ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.