ప్రస్తుతం భారత్ లో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. ఇది ఇంతింతై.. వటుడింతై అన్నట్టుగా భారీగా పెరిగిపోవాలి. అంటే రోజుకి 8లక్షల రోజువారి కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని, ఆ తర్వాత కొవిడ్ ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. గతంలో కూడా సెకండ్ వేవ్ ఎప్పుడు పీక్ స్టేజ్ కి వెళ్తుంది, ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అనే అంచనాలు అక్షరం పొల్లు పోకుండా నిజమయ్యాయి.
ఇప్పుడు కూడా ఆ అంచనాల ప్రకారమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతోంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ పరిశోధనల ప్రకారం ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కి వెళ్తుందని, మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నాటికి పూర్తిగా తగ్గుముఖం పడుతుందనేది నివేదిక సారాంశం.
ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టకుండా చుట్టుకునేలా ఉంది. ఫస్ట్, సెకండ్ వేవ్ లో తప్పించుకున్నవాళ్లు కూడా థర్డ్ వేవ్ లో ముప్పు ఎదుర్కోక తప్పదని తేలిపోయింది. అంటే థర్డ్ వేవ్ లో అత్యథిక జనాభాని కొవిడ్ చుట్టుముడితే ఫిబ్రవరిలో కేసులు భారీగా పెరుగుతాయి, ఏప్రిల్ నాటికి దాని ప్రభావం తగ్గుతుంది. కానీ ముందస్తు జాగ్రత్తల వల్ల కొవిడ్ కేవలం 30నుంచి 60 శాతం మందికి మాత్రమే సంక్రమిస్తే మాత్రం ఫిబ్రవరి నెలాఖరు నాటికి థర్డ్ వేవ్ ప్రభావం కూడా తగ్గిపోతుంది.
ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు మొదలైతే.. అవి కూడా ఈ లిస్ట్ లో చేరే ప్రమాదం ఉంది. అంటే కేసుల సంఖ్య పెరగడమే కానీ, తగ్గే అవకాశాలేవీ లేనట్టు అర్థమవుతోంది. పెరిగి పెరిగి చివరకు ఫిబ్రవరి చివరినాటికి బాగా పెరిగిపోయి, ఏప్రిల్ కల్లా పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని అంటున్నారు వైద్యరంగ నిపుణులు.
అదొక్కటే ఆశాజనకం..
ప్రస్తుతం భారత్ లో రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువ అయినా కూడా గతంలో లాగా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరగలేదు. అంటే థర్డ్ వేవ్ ముప్పు పెద్దగా లేదనే చెప్పాలి. ఈ దశలో కేసుల సంఖ్య పెరిగినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేసులు పెరిగి పెరిగి.. ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయి ఏప్రిల్ నాటికి థర్డ్ వేవ్ కూడా ముగిసిపోతుంది. కానీ ఈలోగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే చేతిచమురు వదలడం ఖాయం.