విశాఖకు కళాకాంతులు… ?

ఈ మధ్యనే ఒక విషయం తెలిసింది. విశాఖ ఇప్పటికి 86 ఏళ్ల క్రితమే ఆంధ్రా సినీ టోన్ పేరుతో ఒక అద్భుతమైన స్టూడియో నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున అందులో షూటింగులు జరివేవని. ఇక ఆనాడు…

ఈ మధ్యనే ఒక విషయం తెలిసింది. విశాఖ ఇప్పటికి 86 ఏళ్ల క్రితమే ఆంధ్రా సినీ టోన్ పేరుతో ఒక అద్భుతమైన స్టూడియో నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున అందులో షూటింగులు జరివేవని. ఇక ఆనాడు ఎక్కువగా తెలుగు. బెంగాళీ సినిమాల షూటింగులు విశాఖలోనే  జరిగేవట. అంతే కాదు, నాడు మద్రాసు, బొంబాయి లాంటి నగరాలతో పాటు విశాఖలోనూ ఒక స్టూడియో బిజీగా ఉండడం గొప్ప విషయం

ఆ తరువాత పరిణామాల క్రమంలో మద్రాస్ లో చిత్ర పరిశ్రమ పూర్తిగా సెటిల్ అయింది. అలా కొంతకాలం జరిగాక తెలుగు రాష్ట్రంలోనే సినిమా నిర్మాణం జరగాలని సినీ పెద్దలు  భావించిన తరువాత 90 దశకంలో హైదరాబాద్ కి చిత్ర పరిశ్రమ షిఫ్ట్ అయింది.

అక్కడ పచ్చగా ఉండగానే రాష్ట్ర విభజన జరగడంతో ఏపీలో ఏడేళ్లుగా సినిమా కార్యకలాపాలు అన్నవే లేకుండా పోతున్నాయి. దీని మీద గత అయిదేళ్ల కాలంలో చంద్రబాబు ప్ర‌యత్నం పెద్దగా చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి చంద్రబాబు తలచుకుంటే సినీ పరిశ్రమ ఏపీకి కొంత షిఫ్ట్ అయ్యేది. ఆయనకు సినీ రంగంతో ఉన్న అనుబంధాలు అలాంటివి అంటారు.

ఇక జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక విశాఖను రాజధానిగా ప్రకటించింది. అదే క్రమంలో విశాఖలో సినిమా రంగాన్ని కూడా విస్తరించాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. ఆ మేరకు గతంలో కొంత దాకా చర్చలు జరిగాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రితో భేటీ అయిన నేపధ్యంలో మరోసారి విశాఖ ప్రస్తావన వస్తోంది.

టాలీవుడ్ కేవలం తెలంగాణాకే పరిమితం కావడం వల్ల దాని ఫలాలు, ఫలితాలూ ఏపీకి అందకుండా పోతున్న పరిస్థితి ఉంది. సినిమా రంగాన్ని ఏపీ సర్కార్ అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అదే సమయంలో సినీ రంగం కూడా ఏపీకి విస్తరించాలన్న డిమాండ్ ఉంది. బహుశా ముఖ్యమంత్రిలో జరిగిన చర్చలో ఈ అంశం ప్రస్థావనకు వచ్చినా రావచ్చు అంటున్నారు. ఇక రానున్న రోజులలో సినీ పెద్దలతో వైసీపీ సర్కర్ జరిపే చర్చలలో కూడా ఇదే అంశం ఉంటుంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఏపీకి సినీ కాంతులు దక్కాలీ అన్న వాదన అయితే ఎక్కువగానే వినిపిస్తోంది. దీని మీద విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని వెల్లడించారు. వారు ఏం కోరుకున్నా తమ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పారు.

అదే సమయంలో సినిమా రంగం ఏపీలో కూడా విస్తరించాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఇక సినీ వర్గాలు స్టూడియోలు కడతామంటే తమ ప్రభుత్వం భూములు ఇచ్చేందుకు కూడా సిధంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి విశాఖలో సినీ పరిశ్రమ ఏర్పాటుకు ఇదే మంచి తరుణమని అంటున్నారు. ఈ విషయంలో జగన్ కనుక సక్సెస్ అయితే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమని విశాఖ కళాకారులు కూడా అంటున్నారు. చూడాలి మరి విశాఖకు ఆ కాంతులు దక్కుతాయా లేదా అన్నది.