నేను రాజకీయాల్లోకి రాను.. నన్ను లాగొద్దు

ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు సినీ ఇండస్ట్రీ తరపున చిరంజీవి ఆయన్ను కలసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, జగన్ తన మాటల్ని సానుకూలంగా విన్నారని మీటింగ్ విశేషాలపై అదేరోజు…

ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు సినీ ఇండస్ట్రీ తరపున చిరంజీవి ఆయన్ను కలసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, జగన్ తన మాటల్ని సానుకూలంగా విన్నారని మీటింగ్ విశేషాలపై అదేరోజు ముక్తాయించారు చిరు. అయితే ఈ భేటీకి కొన్ని ఛానెళ్లు రాజకీయ రంగు పులిమాయి. 

చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆయన్ను వైసీపీ తరపున రాజ్యసభకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయని కథనాలు అల్లారు. అయితే ఈ పుకార్లు గడప దాటి బయటకు వచ్చిన వెంటనే ప్రపంచాన్ని చుట్టేలోపు చిరంజీవి రియాక్ట్ అయ్యారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, తనపై ఇలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని కాస్త ఘాటుగానే బదులిచ్చారు. గివ్ న్యూస్.. నాట్ వ్యూస్ అనే ట్యాగ్ లైన్ కూడా జత చేర్చిన చిరు, రేటింగ్స్ కోసం తనను వాడుకోవద్దని సూచించారు.

చిరు ఏమన్నారంటే..?

“తెలుగు సినిమా పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడకోసం, ఏపీ సీఎం జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలను పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్ కి రాజకీయ రంగు పులిమి.. నన్ను రాజ్యసభకు పంపుతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం.” 

“రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను, మళ్లీ రాజకీయాల్లోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయొద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నాను.”

ఇలా చిరు రెండు ట్వీట్లు వేశారు.

ఏపీలో కాపు రాజకీయం జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఏపీనుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ స్ధానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. ఈ దశలో చిరంజీవిని తమవైపు తిప్పుకోడానికి, పనిలో పనిగా కాపు వర్గాన్ని కూడా ఆకర్షించడానికి సీఎం జగన్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని, దానికి చిరు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కొంతమంది పుకార్లు మొదలు పెట్టారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ పుకార్లను హైలెట్ చేస్తున్నాయి. ఈ దశలో ఈ వార్తలు మరింతగా గుప్పు మనేలోపు చిరంజీవి క్లారిటీ ఇవ్వడం విశేషం. 

వాస్తవానికి చిరంజీవి ఇంత త్వరగా రియాక్ట్ అవుతారని కూడా మీడియా సంస్థలు ఊహించలేదు. రెండు మూడురోజులపాటు ఈ హాట్ టాపిక్ తో టాప్ రేటింగ్స్ తెచ్చుకోవచ్చని అనుకున్నాయి. కానీ చిరంజీవి మాత్రం ఈ పుకార్లకు మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టారు.