Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: రౌడీ బాయ్స్

మూవీ రివ్యూ: రౌడీ బాయ్స్

టైటిల్: రౌడీ బాయ్స్
రేటింగ్: 2.5/5
తారాగణం: ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్, సహిదేవ్ విక్రం, కార్తిక్ రత్నం, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు
కెమెరా: ఆర్. మది
ఎడిటింగ్: మధు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
విడుదల తేదీ:​ 14 జనవరి 2022

ఈ సంక్రాంతికి ఈ సినిమా మీద కాస్త దృష్టి పడడానికి కారణం ఇది దిల్ రాజు తమ్ముడి కుమారుడి అరంగేట్ర చిత్రం.

ప్రతి కథని ఆచి తూచి కాచి వడబోసి ఎంతో జాగ్రత్తగా తీసి ఎన్నో హిట్ సినిమాలు తీసిన దిల్ రాజు క్యాంప్ తమ కుటుంబ సభ్యుడిని హీరోగా లాంచ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా సరైన కథనే ఎంచుకునుంటారని ఒక అంచనా.

అంతే కాదు, ఇదే చిత్రంలో మరొక నిర్మాతైన లగడపాటి శ్రీధర్ తనయుడు సహిదేవ్ విక్రం హీరోతో సమానమైన నిడివి ఉన్న ప్రతినాయకుడులాంటి నాయకుడి పాత్ర చేసాడు.

కనుక ఇద్దరు నిర్మాతల కుటుంబాలకు చెందిన యువనటులు ఇందులో ఉన్నారు.

సుప్రసిద్ధ సంగీత దర్శకుడి దేవిశ్రీప్రసాద్ పేరు కూడా ఈ సినిమా స్థాయిని ఇంకొంచెం పెంచింది.

అసలీ సినిమా ఎలా ఉందో పరిశీలిస్తే మొదటి మార్కు పాటలకి వెయ్యాలి. ఇందులో దాదాపు తొమ్మిది పాటలున్నాయి. వేటికవే క్యాచీగా ఉంటూ యూత్ ని అలరించే స్థాయిలోనే ఉన్నాయి. కొన్ని పాటల్లో సాహిత్యవిలువలు కూడా బాగున్నాయి. అయితే వాటిల్లో ఒక్కటి కూడా వైరల్ కాకపోవడం ఆశ్చర్యం. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్.

ఈ మధ్యన సూపర్ హిట్ మ్యూజికలైతే తప్ప కొత్త హీరోల సినిమాలకు ప్రేక్షకులు రావట్లేదు. ఎందుకో మరి ఇందులోని పాటలు జనం చెవుల్లో హోరెత్తలేదు. పాటలు దానంతటవి వైరల్ కావాలి తప్ప బలవంతంగా వైరల్ చేయడం కుదరదు.

ఇద్దరు యువకుల మధ్యలో ఒక అమ్మాయి చివరికి ఎవరివైపు మొగ్గుతుంది? ఎలా మొగ్గుతుంది? ఈ తరహా ముక్కోణపు ప్రేకథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఇంజనీరింగ్ కాలేజ్- మెడికల్ కాలేజ్ నేపథ్యంలో పరస్పర వైరం, వైరుధ్యం నడిపిస్తూ కథ రాసుకున్నారు. కొద్దిగా "సై", హింది "జోష్" ఛాయలు కనిపిస్తాయి. ఆ స్ఫూర్తి ఉన్నా ఈ కథ స్వతంత్ర కథే.

యూత్ ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమాలో ప్రధానంగా ఉండాల్సింది కామెడీ. అది మిస్సయ్యింది.

దానికి తోడు నిడివి కూడా ఎక్కువే అనిపించింది. ఇదే సినిమా 2 గంటల్లో ముగించేసుంటే తేలిగ్గా అనిపించేది. కానీ ప్రస్తుత నిడివి మాత్రం భారమే.

పెద్ద హీరోలే ప్యాడింగ్ ని, సబ్ ప్లాట్స్ ని నమ్ముకుని స్క్రీన్ ప్లేలు రాయించుకుంటున్న రోజులివి. అలాంటిది అందరూ కొత్త మొహాలని పెట్టి సినిమా తీసి ఏ ప్యాడింగూ లేకుండా చూసేయమంటే చూసేసే పరిస్థితి లేదు. ఆ తప్పు దిల్ రాజు క్యాంప్ ఎందుకు చేసిందో అర్థం కాదు.

టెక్నికల్ గా సంగీతం, కెమెరా వంటివి బాగున్నా సుదీర్ఘ కథనం నీరసం తెప్పిస్తుంది.

దర్శకత్వ విభాగం ఇంకాస్త కష్టపడి సరైన కామెడీ ట్రాక్ ని నడిపుంటే బాగుండేది. ప్రస్తుతానికైతే జస్ట్ ఓకే దర్శకుడిగా పేరు తెచ్చున్నట్టయ్యింది.

కొత్త నటుడు ఆశిష్ లో ఈజైతే ఉంది. డ్యాన్సులు కూడా బాగా చేసాడు. కానీ ఇప్పుడున్న కాంపిటిషన్లో ఆ రెండూ చాలవు. కథలు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. కథనమెటు పోతోందో గమనించాలి. లేకపోతే ఈ రౌడీ బాయ్స్ లాగానే ఉంటుంది పరిస్థితి.

సహిదేవ్ విక్రం విలన్ షేడ్స్ ఉన్న పాత్రలకి సరిగ్గా సరిపోతాడని నిరూపించుకున్నాడు. తన పాత్రకి దేవిశ్రీ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా అతన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది.

అనుపమ పరమేశ్వరన్ గతంలో కంటే చాలా బోల్డ్ గా చేసింది. కాలెజ్ స్టూడెంట్ గా సరిపోయింది. స్టేజ్ డ్యాన్సులో కూడా తన ప్రతిభ కనబరచింది. హీరోల తర్వాత బాగా గుర్తిండిపోయే పర్ఫామెన్స్ చేసింది తానే.

మిగిలిన వాళ్లంతా తెర మీద కదులుతుంటారు తప్ప ఒక్కరు కూడా గెండెల్ని తాకరు.

ఇక అతి ముఖ్యమైన నిర్మాణ విలువల గురించి చర్చించుకోవాలి.

అంత ఘనమైన బ్యానర్ నుంచి యువ హీరో తెరంగేట్రం చేస్తున్నప్పుడు దృష్టి సారించాల్సింది పెద్ద హీరోయిన్స్ మీద, సుప్రసిద్ధ క్యారెక్టర్ నటుల మీద. నిజానికి ఆ ఆలోచనే ఉండాలి కానీ అడిగితే నో చెప్పే నటీనటులే ఉండరు.

అప్పట్లో అల్లు అర్జున్ గంగోత్రి అయినా ప్రస్తుత బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాకైనా హీరోయిన్, ప్యాడింగ్ యాక్టర్స్ సుపరిచితులు. అలాంటి పని దిల్ రాజు ఎందుకు చెయ్యలేదో!

ఆ ప్యాడింగ్ సినిమా విలువని పెంచుతుంది. కనీసం ఒక టాప్ స్టార్ చేత ఐటం సాంగ్ పెట్టినా మంచి బజ్ వచ్చేది. ఉన్నదానికంటే ఎంతో కొంత హెల్పయ్యేది.

మ్యూజిక్ పరంగా దేవిశ్రీప్రసాద్ ని తీసుకొచ్చినట్టు తెర మీద కనిపించే నటీనటుల్ని కూడా అగ్ర శ్రేణి కళాకారుల్ని పెట్టుండాల్సింది.

ఏ నటుడైతే ఏముంది తెర మీద చూడాల్సింది కథే కదా అనుకుంటే పొరపాటవుతుంది. ఒక నిర్మాత ఫ్యామిలీ నుంచి  కమెర్షియల్ హీరోగా తొలి సినిమా చేస్తున్నప్పుడు పై అవకాశాన్ని వాడుకోకపోవడం తప్పవుతుంది.

ఏదైతేనేం, మొత్తానికి మరొక "సినీ ఫ్యామిలీ" హీరో తెరమీదికొచ్చాడు. నలుగురితో పాటూ నారాయణ అన్నట్టు కాకుండా తనకంటూ ఒక కొత్త దారి వేసుకుని ప్రత్యేకత చాటుకునే సినిమాలు చేస్తే రాణిస్తాడు. అలా కాకుండా మూస ధోరణి కథలతో సినిమాలు చేసుకున్నట్టైతే ఎదగడానికి అదృష్టం కలిసిరావాలి. అది ఎంతవరకూ ఉందో చూడాలి.

యూత్ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాకి పోషకులు. వాళ్లకైనా అద్భుతంగా అనిపించదు కానీ "టైం పాస్ కి ఓకే" అన్నట్టుండొచ్చు.

బాటం లైన్: జస్ట్ ఓకే బాయ్స్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?