అసెంబ్లీలో కోటంరెడ్డి ఓవ‌రాక్ష‌న్‌!

అసెంబ్లీ స‌మావేశాల్లో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఓవ‌రాక్ష‌న్ చేశారు. ఈ మాట‌ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయిన వెంట‌నే చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై చ‌ర్చించాల‌ని టీడీపీ…

అసెంబ్లీ స‌మావేశాల్లో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఓవ‌రాక్ష‌న్ చేశారు. ఈ మాట‌ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయిన వెంట‌నే చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై చ‌ర్చించాల‌ని టీడీపీ స‌భ్యులు ప‌ట్టుప‌ట్టారు. బాబును అన్యాయంగా, అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ స‌భ్యులు నినాదాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ స‌భ్యులు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళ‌న‌కు దిగారు. వైసీపీ నుంచి గెంటివేత‌కు గురైన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి టీడీపీ స‌భ్యుల కంటే ఓవ‌రాక్ష‌న్ చేశారు. స్పీక‌ర్ మానిట‌ర్‌ని ఆయ‌న లాగేశారు. అలాగే టీడీపీ స‌భ్యుల‌తో పాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి కూడా ఆందోళ‌న చేశారు. ఈమె కూడా వైసీపీ నుంచి స‌స్పెండ్‌కు గురైన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా వుండ‌గా త‌మ పార్టీ త‌ర‌పున గెలుపొంది, ఇప్పుడు అసెంబ్లీలో కోటంరెడ్డి నానాయాగీ చేయ‌డంపై వైసీపీ స‌భ్యులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు దృష్టిలో ప‌డేందుకే కోటంరెడ్డి ఎక్స‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శించారు. ఇటీవ‌ల కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని నెల్లూరు రూర‌ల్ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థి అనురాధ‌కు ఓటు వేశార‌నే కార‌ణంతో స‌స్పెండ్ చేశారు. అనంత‌రం ఆయ‌న టీడీపీ పంచ‌న చేరారు. తాజాగా టీడీపీ స‌భ్యులను మించిపోయి అసెంబ్లీలో కోటంరెడ్డి హ‌డావుడి చేయ‌డాన్ని వైసీపీ సీరియ‌స్‌గా గ‌మ‌నిస్తోంది.