రచ్చ చేయడమే లక్ష్యంగా చెలరేగుతున్న తెదేపా!

శాసనసభ సమావేశాలు మొదలైన సమయం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు సభలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తెలుగుదేశం సభ్యులు నానా గందరగోళం సృష్టించడంతో స్పీకర్ 10 నిమిషాల సభను…

శాసనసభ సమావేశాలు మొదలైన సమయం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు సభలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తెలుగుదేశం సభ్యులు నానా గందరగోళం సృష్టించడంతో స్పీకర్ 10 నిమిషాల సభను వాయిదా వేసి తిరిగి ప్రారంభించిన కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. దూసుకెళ్లిన సభ్యులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే స్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కూడా కీలకం అవుతున్నాయి.

ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే స్పీకర్ యధావిధిగా ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ముందుగా ఆమోదించాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు గొడవ చేయడం ప్రారంభించారు. ఒకవైపు అధికార పార్టీ సభ్యులు, మంత్రులు మాట్లాడుతూ ఉండగానే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కలిసి స్పీకర్ పోడియంను చుట్టుముట్టి గందరగోళం సృష్టించడం గమనార్హం. 

ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లేచి నిల్చుని చాలా సమంజసమైన ప్రతిపాదన చేశారు. తెలుగుదేశం సభ్యులకు కోరుతున్నట్లుగానే చంద్రబాబు నాయుడు అరెస్టుపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించాలని కోరారు. అయితే దేనికైనా సరే ఒక పద్ధతి ఉంటుందని.. పద్ధతి ప్రకారం వచ్చినప్పుడు దాని ఆమోదించాలని ఆయన సూచించారు. ఇవాళ బీఏసీ సమావేశం జరిగినప్పుడు.. అక్కడ ప్రతిపాదన పెడితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి చర్చించేందుకు అధికార పార్టీ కూడా సిద్ధంగా ఉన్నదని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

తెలుగుదేశం నాయకులు ఎంత సమయం అడిగితే అంతకంటే ఎక్కువ సమయం ఇవ్వాలని ఆయన స్పీకర్ను కోరారు. స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన అవినీతిపై చంద్రబాబు అరెస్ట్ గురించి చర్చ మొదలు పెడితే.. తాము అడిగే ప్రశ్నలకు వారు సమాధానాలు వెతుక్కోవాల్సి ఉంటుందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  సవాలు విసిరారు.

టిడిపి అడుగుతున్నట్లుగా వాయిదా తీర్మానాన్ని అనుమతించడానికి శాసనసభ వ్యవహారాల మంత్రి స్వయంగా అంగీకారం చెబుతున్నప్పటికీ.. తెలుగుదేశం నాయకులు చేస్తున్న గోల హద్దులు దాటిపోతుంది. ఒకవైపు అంబటి రాంబాబు తన మాటల్లో.. తెలుగుదేశం నాయకుల వాదన ఏమైనా ఉంటే అరెస్టు అక్రమం అని భావిస్తే ఆ విషయాన్ని ఢిల్లీ నుంచి పిలిపించిన తమ న్యాయవాదుల ద్వారా కోర్టులో చెప్పాలి తప్ప అసెంబ్లీలో అరవడం సరికాదని అన్నారు. 

బీఏసీ ద్వారా వాయిదా తీర్మానం కోరాలని, పద్ధతి ప్రకారం రావాలని అంటున్నప్పటికీ తెలుగుదేశానికి చెందినవారు రభస చేయడం సర్వత్రా విమర్శల పాలవుతోంది.