వెండి తెరపై హీరోగా విశేష ఆదరణ పొందిన జనసేనాని పవన్‌కల్యాణ్….రాజకీయాల్లోకి వచ్చాక కామెడీ పాత్ర పోషిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు అన్న నాగబాబు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్‌లో కామెడీ స్కిట్స్‌ను రాజకీయాల్లో పవన్ ప్రదర్శిస్తున్నారనిపిస్తోంది. రాజధానిపై పవన్ మాటలు వింటున్న వారికి నవ్వు తెప్పిస్తోంది.
ఏపీ అసెంబ్లీలో నిన్న మూడు రాజధానుల బిల్లు సభ్యుల ఆమోదంతో చట్టమైంది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో పవన్ విలేకరులతో మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇంతకూ ఆయన జగన్ సర్కార్‌నుద్దేశించి ఏమన్నారంటే…
‘‘పిచ్చిపిచ్చి విధానాలతో ప్రజల్లో అశాంతి సృష్టించారు. ఈ పిచ్చితనం ఆపాలనే బీజేపీతో కలిశాం. టీడీపీకి బలం సరిపోవడం లేదు. విభజించే వైసీపీని ఎదుర్కొనేది బీజేపీ -జనసేనే. ప్రజలను కన్నీళ్లు పెట్టించిన వారికి ఉసురు తగులుతుంది. వారి స్వార్థం కోసం విచ్ఛిన్నం చేసే విధానానికి ఎక్కడో చోట కట్టడి ఉండాలి’’
వైసీపీని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రతిపక్ష టీడీపీకి బలం సరిపోవడం లేదట. అసెంబ్లీలో టీడీపీకి 23 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీ -జనసేన బలం శూన్యం. ఉన్న ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా మూడు రాజధానుల వైపే మొగ్గు చూపాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం లోపు, జనసేనకు 7 శాతం ఓట్లు పడ్డాయి. టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ-జనసేన రెండు పార్టీల బలం 8 శాతం లోపే.
40 శాతం ఓట్ల బలం ఉన్న టీడీపీ బలం సరిపోలేదట. తమ 7 శాతం లోపు బలంతో 50 శాతం ఓట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న వైసీపీని ఎదుర్కొంటారట. ఇదెక్కడి విడ్డూరమో రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు. మరీ పవన్‌కల్యాణ్ జబర్దస్త్ కామెడీ చేస్తున్నాడు.