పెట్రోల్ కు తోడు టోల్ బాదుడు పెంపు!

వాహ‌న‌దారుల‌ను కేంద్రం బెంబేలెత్తించ‌డం ఆగడం లేదు. అంత‌ర్జాతీయ స్థాయిలో ముడిచ‌మురు ధ‌ర‌ల‌తో పొంత‌న లేని రీతిన పెట్రో ధ‌ర‌ల‌ను పెంచి సొమ్ము చేసుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వం, టోల్స్ విష‌యంలో కూడా వాహ‌న‌దారుల‌ను బాదుతూనే ఉంది.…

వాహ‌న‌దారుల‌ను కేంద్రం బెంబేలెత్తించ‌డం ఆగడం లేదు. అంత‌ర్జాతీయ స్థాయిలో ముడిచ‌మురు ధ‌ర‌ల‌తో పొంత‌న లేని రీతిన పెట్రో ధ‌ర‌ల‌ను పెంచి సొమ్ము చేసుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వం, టోల్స్ విష‌యంలో కూడా వాహ‌న‌దారుల‌ను బాదుతూనే ఉంది. ఇప్ప‌టికే టోల్స్ విష‌యంలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. టోల్స్ శాశ్వ‌తం అని స్ప‌ష్టం చేశారాయ‌న‌!

పీపీపీ, హామ్ (హెచ్ ఏఎం) ప‌ద్ధ‌తిలో నిర్మించే రోడ్ల విష‌యంలో టోల్స్ వ‌సూళ్ల‌కు ఒక లెక్క ఉంటుంది! వెయ్యి కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఒక స్ట్రెచ్ రోడ్డు నిర్మాణం జ‌రిగితే, ఆ వెయ్యి కోట్ల రూపాయ‌ల వ‌సూలు పూర్త‌య్యాకా.. అక్కడ టోల్ ఎత్తేయాలి. అయితే ఇలా నిర్మాణ వ్య‌యం వ‌సూలైన రోడ్ల‌పై కూడా టోల్స్ ఎత్తేసే ఉద్దేశం లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. 

జాతీయ ర‌హ‌దారి 44 నే తీసుకుంటే, ఈ రోడ్డుపై ప్ర‌తి 90 కిలోమీట‌ర్ దూరానికి ఒక టోల్ గేట్ పెట్టి.. 2005 నుంచి వ‌సూలు చేస్తూనే ఉన్నారు! 18 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయినా.. ఆ వ్య‌యం వ‌సూలు కాలేదా? అయితే.. ఎలా లెక్కేసి చూసినా ఆ వ్య‌యం ఎప్పుడో వ‌సూలైపోవ‌డ‌మే కాదు, మెయింటెయినెన్స్ ఖ‌ర్చులతో పోలిస్తే అనేక రెట్ల సొమ్ములు వ‌సూలై ఉంటాయి. అయితే ఇలా నిర్మాణ వ్య‌యం, మెయింటెయినెన్స్ ఖ‌ర్చులు వ‌చ్చిన రోడ్ల‌పై కూడా గేట్లు అలానే ఉన్నాయి. ఇవి శాశ్వ‌తం అని కేంద్ర‌మంత్రి ప్ర‌క‌టించేశారు!

అదే అనుకుంటే.. ప్ర‌తి యేడాదీ టోల్ రేట్ల‌ను పెంచే ప‌ద్ధ‌తిని కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. మూడేళ్ల కింద‌టి వ‌ర‌కూ చాలా టోల్ గేట్ల వ‌ద్ద 90 రూపాయ‌ల మొత్తం చెల్లించాల్సి వ‌చ్చేది. ఇప్పటికే అది 105 రూపాయ‌ల‌య్యింది. ఇప్పుడు తాజాగా మ‌ళ్లీ పెంపు! 115 వ‌ర‌కూ! ఇలా గ‌త మూడేళ్ల‌లోనే టోల్ చార్జీలు ప్ర‌తి 90 కిలోమీట‌ర్ల‌కూ స‌గ‌టున 25 రూపాయ‌ల వ‌ర‌కూ పెరిగాయి! 

మొన్న‌టి వ‌ర‌కూ హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వ‌ర‌కూ రోడ్డు ప్ర‌యాణం చేస్తే.. క‌నీసం 840 రూపాయ‌ల టోల్ చార్జీలు క‌ట్టాల్సి ఉండేది. అది కూడా కారు -జీపు రేటు ఇది. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య‌న సుమారు దూరం 600 కిలోమీట‌ర్లు అనుకుంటే.. 600 కిలోమీట‌ర్ల‌కూ 840 రూపాయ‌ల టోల్! అంటే ప్ర‌తి కిలోమీట‌ర్ కూ 1.40 పైస‌లు! ఇప్పుడు ప్ర‌తి టోల్ గేట్ వ‌ద్దా స‌గ‌టున ప‌ది రూపాయ‌లు పెరిగినా.. ఈ న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణానికి టోల్ వ్య‌యం 900 రూపాయ‌ల‌ను దాటేస్తుంది! ఇప్ప‌టికే భారీ స్థాయికి చేరిన పెట్రోల్ ధ‌ర‌ల‌కు తోడు టోల్ బాదుడుతో ప్ర‌యాణం మ‌రింత ప్రియం అవుతోంది!