టాలీవుడ్ కు ఓ కొత్త రూట్ దొరికింది. కథలు వండడం అంటే మన పెద్ద దర్శకులకు బద్దకం. లేదా క్రియేటివిటీ బ్లాక్. ఓ స్టేజ్ కు వెళ్లిపోయాక ఇక కథలు కరువైపోతాయి. అక్కడి నుంచి పరాజయాలు పలకరించడం మొదలవుతుంది. ఇలాంటి దానికి దర్శకుడు త్రివిక్రమ్ కనిపెట్టిన షార్ట్ కట్ ఒకటి వుంది. పాత సినిమాల కథలు తీసుకుని కొత్త నేపథ్యంలో, కొత్త హంగులతో, కొత్తగా తీసేయడమే.
అ..ఆ… మీదుగా అల వైకుంఠపురములో వరకు చేసింది అదే అని అందరికీ తెలిసిందే. రంగస్థలం సినిమా లైన్ కూడా పల్లెటూరు కుల రాజకీయాలే..డిఫరెంట్ ప్రెజెంటేషన్. ఉప్పెన..పెద్దింటి అమ్మాయి..చిన్నింటి కుర్రాడు..ప్రేమలు..కష్టాలు..గండి కోట రహస్యం..కంచుకోట… ఇలా రాజ కుటుంబాల అంత:పుర కుట్రలతో సవాలక్ష సినిమాలు. అదే కనుక ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఙానంతో భారీగా తీస్తే…బాహుబలి అయిపోదూ..
లేటెస్ట్ గా దసరా సినిమా చూడండి
గతంలో వచ్చిన అనేక సినిమాలు గుర్తుకు వస్తాయి. చిల్లరదేవుళ్లు..మనవూరి పాండవులు ఇలా. పల్లెటూరు..దొరస్వామ్యం..బడుగు జీవులు..కనిపించిన ప్రతి మహిళను పక్కలోకి లాగడం..అందుకోసం కుట్రలు పన్నడం. అదే కదా. పేరు పెట్టకుండా అమలాపురం పక్కన ఊరు అన్నా, సంగారెడ్డి సమీపంలో అన్నా అదే కథ తీయొచ్చు. కానీ కెజిఎఫ్ కు కోలార్ గనుల బ్యాక్ డ్రాప్…డార్క్ థీమ్. మనఊరి పాండవులు లాంటి కథకు డార్క్ థీమ్ కావాలంటే ఏం చేయాలి? సింగరేణి గనులే మనకు వున్నవి…ఆ బ్యాక్ డ్రాప్ తీసుకుంటే..కొత్తగా మారిపోతుంది కదా? అదే చేసినట్లు కనిపిస్తుంది సినిమా చూస్తుంటే.
అయిదు కోట్ల ఖర్చుతో క్లయిమాక్స్ తీసారు. అంత మంది జనాలు…అన్ని రోజుల షూట్…అంత భారీ రావణాసురుడు..ఇంకా..ఇంకా…బట్ అల్టిమేట్ గా జరిగేది ఏమిటి? హీరో విలన్ ను చంపేసి, జైలుకు వెళ్లి తిరిగి రావడం. సినిమాల్లో ఇది లక్షలతో తీస్తే ఇప్పుడు కోట్లతో తీస్తున్నారు. అంటే విషయం పాతదే..వివరణ కొత్తది అన్నమాట.
ఊళ్లో కులాల రాజకీయాలు..కానీ ఘర్షణ ఏమీ వుండదు. బార్ బయట వుండడానికే అలవాటు పడిపోయిన ప్రాణాలు.
అన్నదమ్ముల అధికార దాహం నేపథ్యంలో బలయ్యారా? అంటే అదీ కాదు. అధికారం పోయినా విలన్ బాధపడలేదు..
అమ్మాయి చేజారిందని బాధపడ్డాడు. చేజారకుండా చేయాలనుకున్నాడు.
పిల్లిని గదిలో వుంచి కొట్టాలని చూస్తే పులైపోతుందని సామెత. పిరికివాడైన హీరో పులైపోయి విలన్ ను చంపేసాడు.
ఇలా రీమిక్స్ లేదా రీ డిటైలింగ్ విత్ న్యూ బ్యాక్ డ్రాప్ సినిమాలను జనం ఆదరిస్తున్నారు అంటే అప్పటి సినిమాల్లో వున్న చిన్నదో, పెద్దదో కథ. ఇప్పటి జనరేషన్ కు అంత ఆలోచించే తీరుబాటు లేదు. టెక్నికల్ ప్యాడింగ్ కావాల్సినంత వుంది. ది బెస్ట్ టెక్నీషియన్లను నిర్మాత ఖర్చుతో దింపొచ్చు. కొత్తగా తీసి చూపించి శహభాష్ అనిపించుకోవచ్చు. ఇదే కొత్త స్కీము.