మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు దొరికిన పెద్ద ఆయుధం ఏదో తెలుసా? రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్! పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి, 40 యేళ్ల అనుభవం, ప్రజల సొమ్ముతో దేశ దేశాలూ తిరిగిన మేధావి, బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ ల సమస్థాయి తనది అని ఒకటికి వంద సార్లు చెప్పుకునే నేత.. తన జీవనర్మరణ సమస్యలా ట్రీట్ చేస్తున్న వ్యవహారం గురించి అసెంబ్లీలో ప్రసంగిస్తే.. ఏదో అద్భుతమైన పాయింట్లు పడతారని ఎవరైనా అనుకుంటారు!
మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకిచండానికి చంద్రబాబు నాయుడు ఏదో అద్భుతమైన ఫార్ములాను చెబుతారని ఆయన అభిమానులు కూడా ఆశించారు. అయితే చంద్రబాబునాయుడు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అసెంబ్లీలో తన ప్రసంగంలో చెప్పిన మాటేంటంటే.. రేవంత్ రెడ్డి గారి స్టేట్ మెంట్!
ఏపీకి మూడు రాజధానులు అంటే తనకు ఎంతో ఆనందంగా ఉందని రేవంత్ అన్నారట. అలా చేయడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి అవుతుందట.. అందుకే రేవంత్ రెడ్డి ఆనంద పడ్డారట. అయితే భారతీయుడుగా మాత్రం ఏపీ విషయంలో రేవంత్ రెడ్డి బాధపడ్డారట! ఇదీ చంద్రబాబుగారు అసెంబ్లీలో సెలవిచ్చిన అంశం.
ఆరు నెలల కర్రసాము చేసి మూలనున్న ముసలమ్మ మీద ప్రతాపం చూపినట్టుగా ఉంది చంద్రబాబు తీరు. అసెంబ్లీలో ప్రసంగంతో దుమ్ముదులిపేయాల్సిన సమయంలో.. అద్భుతమైన విషయాలను కోట్ చేయాల్సింది పోయి.. తనకు గట్టిగా చంచాగిరి చేసిన రేవంత్ రెడ్డి మాటలను ఎత్తుకోవడం చంద్రబాబు నాయుడి పరిస్థితిని చాటుతూ ఉందని అంటున్నారు పరిశీలకులు.
రేవంత్ రెడ్డి ఏమీ అపర మేధావి కాదు.. వదరబోతు నేత. ఒక ఎమ్మెల్యే ఓటు ను కొనుగోలు చేయడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి.. వీడియో కెమెరాలకు చిక్కిన నేత. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మేధస్సు ఏపాటితో తెలుగు వాళ్లెవ్వరికీ తెలియనిదీ కాదు. అలాంటి వ్యక్తి రోజుకు వంద స్టేట్ మెంట్లు ఇస్తూ ఉంటారు. ఆయన స్టేట్ మెంట్ ను పట్టుకుని.. ఆయనేదో విన్ స్టన్ చర్చిల్ అయినట్టుగా, ఆయన మాటలను చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉటంకించారు!
శివరామకృష్ణన్ వంటి టౌన్ ప్లానింగ్ లో ఉద్ధండులు అయిన వారి రిపోర్టును బుట్టదాఖలు చేసిన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి అర్భక నేతల మాటలు వేదవాక్కులు అయినట్టుగా అసెంబ్లీలో ప్రస్తావంచి.. మరోసారి ప్రహసనం పాలయ్యారు.