గుంటూరు జిల్లాలో తాడికొండ ఎంతో కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇది రాజధాని ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు.
రాజకీయాలకు ఆమె కొత్త. ముఖ్యమైన నియోజక వర్గంలో అధికార పార్టీ వీధిన పడింది. దీనికి కారణం ఎమ్మెల్యే, సస్పెన్షన్కు గురైన నాయకుల మధ్య విభేదాలే కారణమని తెలుస్తోంది.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదలుకుని పార్టీ ముఖ్యనేతలంతా ఉన్న ప్రాంతంలో పార్టీని రచ్చకీడుస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది. తాజాగా తాడికొండలో పార్టీ విభేదాలు పోలీసుల కేసుల వరకూ వెళ్లాయి.
అందులోనూ ఒక అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యే తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయడం …. ఒక రకంగా జగన్ సర్కార్కు చిన్నతనమనే చెప్పాలి. అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది.
తన మాజీ అనుచరులైన సందీప్, సురేష్తో పాటు మరో ఇద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తాడికొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.
సందీప్, సురేష్ ఇటీవలే వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారని, దీంతో తనపై కక్ష పెంచుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది ఇలా ఉండగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అక్రమ కేసులు పెట్టి తనను వేధిస్తున్నారని , ముఖ్యమంత్రి జగన్ తనను కాపాడాలంటూ సస్పెండ్ అయిన సందీప్ తాజాగా సెల్పీ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశాడు.
ఎమ్మెల్యే ఫిర్యాదుతో అజ్ఞాతంలోకి వెళ్లిన సందీప్ తన అభిప్రాయాన్ని చెప్పేందుకు వీడియో విడుదల చేయడం గమనార్హం. అక్రమ కేసుల కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని, కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారని అతను కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు.
చావు తప్ప మరో మార్గం కనిపించటం లేదన్నాడు. పార్టీకి మొదటి నుంచి సేవలందించానని, శ్రీదేవికి కష్టకాలంలో అండగా ఉన్నానని అతను చెప్పుకొచ్చాడు. ఎమ్మెల్యే శ్రీదేవి, సీఐ ధర్మేంద్ర వల్ల తనకు ప్రాణహాని ఉందని అతను ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో వ్యవహారం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది.
మరో వైపు శ్రీదేవి పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఏది ఏమైనా తామున్న ప్రాంతంలో పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు నాయకులు వ్యవహరి స్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఈ వివాదానికి ఓ పరిష్కారం కనుగొని పార్టీ పరువు కాపాడాల్సిన అవసరం ఉంది.