అల్లరి నరేష్ పేరు వింటేనే పెదాలపై నవ్వు తొణికిసలాడుతుంది. మనసు రిలాక్స్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే టాలీవుడ్‌లో అనేక మంది హాస్యనటులు ఉన్నప్పటికీ …రాజేంద్రప్రసాద్ తరహాలో అల్లరి నరేష్‌ను ప్రేక్షకులు చూసు కుంటారు.
తన నటనతో కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ విశేష సంఖ్యలో అల్లరి నరేష్ అభిమానుల్ని సంపాదిం చుకున్నారు.అయితే కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ … తాజాగా కేవలం ఆ పాత్రలకే పరిమితం కాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అంటే అన్ని రకాల విభిన్న పాత్రల్ని పోషిస్తూ …. కామెడీ హీరో ముద్ర నుంచి బయటపడాలని సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు టాలీవుడ్ టాక్. ఇంత వరకూ అల్లరి నరేష్ సినిమాలంటే కామెడీకి పర్యాయపదంగా చెప్పుకోవడం తెలిసిందే.
తక్కువ కాలంలో 50 సినిమాల్లో నటించిన హీరోగా అల్లరి నరేష్ పేరు తెచ్చుకున్నారు. వాటిలో చాలా వరకు కమర్షియల్ హిట్ సాధించాయి. సుడిగాడు సినిమాతో నరేష్ కామెడీకి ఓ బ్రాండ్‌గా మారాడంటే అతిశయోక్తి కాదు.
2012 లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే తండ్రీకొడుకులుగా అల్లరి నరేష్ ద్విపాత్రాభి నయం చేయడం.
కానీ కొంత కాలంగా ఒకే రకమైన కామెడీ సినిమాలతో ప్రేక్షకులకు మొహమొత్తిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అల్లరి నరేష్ సినిమాలను కూడా ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నట్టు ….ఆయన సినిమాలు ఆడే తీరే చెబుతోంది.
అల్లరి నరేష్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మారకపోతే అసలుకే ఎసరు వస్తుందని గ్రహించారంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక మీదట కేవలం కామెడీ సినిమాలనే కాకుండా అన్ని రకాల పాత్రల్లో నటించడానికి గట్టిగా నిర్ణయించుకున్నట్టు టాలీవుడ్ టాక్.
కొత్త ప్రయోగాలు చేయడానికి కూడా అల్లరి నరేష్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్లు అల్లరి నరేష్ అభిప్రాయపడుతున్నాడు. కామెడీ సినిమాలకు దూరంగా ఉంటానని ఆయన తేల్చి చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే కామెడీ హీరోగా కాకుండా ఇతర పాత్రల్లో నటించాలనే అల్లరి నరేష్ నిర్ణయాన్ని దర్శక నిర్మాతలు ఏ విధంగా తీసుకుంటారో భవిష్యత్ కాలమే తేల్చాలి. గత కొన్నేళ్లుగా ఒక తరహా సినిమాలపై తన మార్క్ వేసుకున్న అల్లరి నరేష్ , ఇక మీదట అందుకు భిన్నమైన పాత్రల్లో కనిపించాలనుకోవడం కామెడీ కాదు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.