ఒకవైపు రాజకీయ వివాదాలు.. మరోవైపు అంచనా వ్యయంపై వివాదాలు.. ఈ పరిణామాల్లో పోలవరం పరిస్థితి ఏమిటి? అనేది సర్వత్రా చర్చగా మారుతూ ఉంది. గోదావరి నదికి ఎన్ని మలుపులు ఉంటాయో.. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే స్థాయి మలుపులు ఉన్నట్టున్నాయి. ఎప్పుడో శతాబ్దం కిందటి నాటి ప్రతిపాదన ఇప్పటికీ పూర్తి కాలేదంటే.. అది విచిత్రమే అనుకోవాలి!
శతాబ్దాల అవసరాన్ని నాటి పాలకులు పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టు గురించి శ్రద్ధ చూపింది, దానికి ఉన్న ఒక్కో అడ్డంకిని తొలగిస్తూ ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించింది నిస్సందేహంగా వైఎస్ రాజశేఖర రెడ్డి. తనపై నమ్మకం ఉంచి పీఠాన్నెక్కించిన ప్రజల రుణాన్ని వైఎస్ అనేక రకాలుగా తీర్చుకుని వెళ్లారు.
వైఎస్ మరణం తర్వాత పోలవరం కథ మళ్లీ మొదటికే రావడం ఆంధ్రుల దురదృష్టం తప్ప మరేం కాదు. విభజనతో నష్టపోవడం ఆ తర్వాతి దెబ్బ. విభజనతో పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా తీసుకున్నారు. అయితే దాన్ని సవ్యంగా సాగనివ్వక చంద్రబాబు నాయుడు మరో శాపంగా మారారు.
ఇక చంద్రబాబు హయాంలో పోలవరం అంచనాలకు సంబంధించిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పాట్లు పడుతూ ఉంది. పాత అంచనాలతో సాధ్యం కాని ప్రాజెక్టు నిర్మాణాన్ని కొత్త అంచనాలకు తగ్గట్టుగా సవరించాలని కేంద్రాన్ని కోరుతోంది జగన్ ప్రభుత్వం.
ఇదంతా వార్తల్లోని అంశం. మరి ఇంతకీ పోలవరం క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందంటే.. పనులు సవ్యంగానే సాగుతున్నాయని స్పష్టం అవుతోంది.
పోలవరం ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది అన్ని రకాలుగానూ ప్రత్యేకమే, అన్ని రకాలుగానూ భారీ ప్రాజెక్టే! అందుకు తగ్గట్టుగా నిర్మాణం సాగుతోంది. మొత్తం 48 హైడ్రాలిక్ గేట్లు, వీటికి సంబంధించి 52 మీటర్ల ఎత్తు ఉన్న పియర్ పిల్లర్లు, వాటిపై గడ్డర్ల నిర్మాణం కూడా పూర్తైనట్టుగా తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వం వచ్చాకా కాంక్రీట్ కు సంబంధించి కీలకమైన పనులు పూర్తయ్యాయి. ప్రపంచంలోని అన్ని బహుళార్దక సాధక ప్రాజెక్టులలో కెళ్లా అది పెద్దదిగా నిలవబోతోంది పోలవరం స్పిల్ వే. అలాంటి అద్భుత నిర్మాణం జరుగుతోందిప్పుడు.
ఒకేసారి 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా ఈ నిర్మాణం సాగుతూ ఉంది. 194.6 టిఎంసీల నిల్వ, 320 టిఎంసీల వినియోగమే లక్ష్యంగా పోలవరం నిర్మాణం పూర్తవుతోంది. దాదాపు ఏడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. 80 టీఎంసీల నీరు కృష్ణకు మళ్లిస్తారు.
ఇన్ని భారీ లక్ష్యాలు నెరవేరే సమయం మరెంతో లేదు. ఇప్పటికే ఎన్నో ఆటంకాలను దాటుకుని వచ్చిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటికీ కొన్ని ఆటంకాలున్నా.. వాటిని కూడా అధిగమించి, నిలువెత్తు అద్భుతంగా నిలిచేందుకు సమయం మరెంతో దూరంలో లేదు.