దాదాపు రెండు దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యాక్టివ్ గా వుంటూ, చక్రం తిప్పుతూ, తన హవా సాగిస్తున్న గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం పూర్తిగా చేష్టలుడిగి కూర్చున్నట్లు కనిపిస్తోంది.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తరువాత గంటా క్రమంగా ఆ పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు. మధ్యలో కొన్నాళ్ల క్రితం గంటా వైకాపా తీర్థం తీసుకోబోతున్నారంటూ బలంగా వినిపించింది. ఆయన వైకాపాలోకి రావడానికి వీల్లేదంటూ అంతే బలంగా అసమ్మతి స్వరం కూడా వినిపించింది.
మొదట్లో విజయసాయి రెడ్డికి ఇష్టం లేదన్నారు. తరువాత ఆయన ఓకె అన్నారు అన్నారు. కానీ ఇంతలో మంత్రి అవంతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ లాంటి వారు ససేమిరా అంటున్నారు అన్నారు. మొత్తానికి గంటా అయితే వైకాపాలోకి రాలేదు.
పోనీ అలా భాజపాలోకి వెళ్లలేదు. ఎటూ వెళ్లకపోయినా, స్వంత పార్టీలో నైనా యాక్టివ్ గా లేరు. గంటాకు బోలెడు వ్యాపార లావాదేవీలు వున్నాయి. ఇప్పుడు అనవసరంగా ఎక్కువ రెచ్చిపోతే వైకాపా ఎక్కడో అక్కడ చెక్ చెబుతుందనే ఆలోచన లేదా భయం వుండి వుండొచ్చు.
అచ్చెన్న, బండారు, అయ్యన్న, సబ్బం హరి లాంటి ఓ సామాజిక వర్గం జనాలే ఉత్తరాంధ్ర జనాలే చాలా యాక్టివ్ గా వున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గం లో కూడా గంటా పేరు కనిపించలేదు.
నిజానికి గంటాకు అన్ని విధాల అర్హత వుంది. పైగా కీలకమైన పదవే ఇవ్వాలి. అలాఇవ్వడానికి తెలుగుదేశం పార్టీకి కూడా అభ్యంతరం వుండి వుండదు. కానీ పని చేయకుండా, పైగా ఎప్పుడయినా జంప్ అనేస్తారు అనే టాక్ వున్న గంటాకు ఓ కీలకమైన పార్టీ పదవి ఇస్తే, ఆయన జంప్ అంటే పార్టీకి నామర్దాగా వుంటుంది.
బహుశా అందుకే ఈయన వద్దని వుంటారు. వారు ఇవ్వడానికి జంకి వుంటారు. మొత్తం మీద ప్రస్తుతానికి అయితే తెలుగుదేశంలో గంటా చాప్టర్ కు కామా పడిపోయినట్లే.