అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే రచ్చకు తెరలేచింది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్‌కు తెరలేచింది. టీడీపీ సభ్యులు బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీలో బల్లలు చరుస్తూ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
బాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం అని ఇక్కడ అరవడం కాదని, న్యాయస్థానంలో బల్లలు గుద్ది ఢిల్లీ నుంచి తెచ్చుకున్న లాయర్లతో వాదనలు వినిపించాలని హితవు చెప్పారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన అభ్యంతరకరంగా వుందని, వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను అంబటి కోరారు.
సభలో టీడీపీ సభ్యులు రెచ్చగొడుతున్నారని, తమ వాళ్లు అదే విధంగా ప్రవర్తిస్తే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం వుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసాలు తిప్పడంతో అంబటి ఫైర్ అయ్యారు. సినిమాల్లో మీసాలు తిప్పుకోవాలని, దమ్ముంటే రా అంటూ బాలయ్యకు అంబటి సవాల్ విసరడం సభలో ఉద్రిక్తత వాతావరణం నెలకుందనే సంగతిని స్పష్టం చేసినట్టైంది.
స్పీకర్ మానిటర్‌ను లాక్కునేందుకు టీడీపీ సభ్యుల ప్రయత్నిస్తోందని అంబటి విమర్శించారు. మరోవైపు టీడీపీ సభ్యులకు వ్యతిరేకంగా అధికార పక్ష సభ్యులు కూడా స్పీకర్ దగ్గరకు చేరుకున్నారు. పోటీపోటీగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది.