ఏపీ అసెంబ్లీ సమావేశాలను అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు పరస్పరం కొట్టుకునేందుకు, తిట్టుకునేందుకు నిర్వహించారేమో అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అసెంబ్లీని కుదిపేస్తోంది. సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా వేశారంటే, టీడీపీ సభ్యులు ఏ స్థాయిలో గొడవకు దిగారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అధికార పార్టీ సభ్యులు కూడా ఏ మాత్రం తగ్గలేదు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ప్రత్యర్థులను రెచ్చగొడుతూ మీసం తిప్పారు. ఇదే సందర్భంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తొడకొట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు టీడీపీ పట్టుపట్టడంతో గొడవకు దారి తీసింది.
నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో కూడా తాను హీరో అనే రేంజ్‌లో రా చూసుకుందాం అంటూ మంత్రి అంబటి రాంబాబుకు సైగలు చేస్తూ సవాల్ విసిరారు. అంబటి కూడా ఏ మాత్రం తగ్గకుండా గట్టి కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టి గొడవ చేస్తుండడంతో అధికార పక్ష సభ్యులు ఒక్కసారిగా దూసుకెళ్లారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తొడకొట్టి ప్రత్యర్థులకు సవాల్ విసరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సభ నడిచే పరిస్థితి లేకపోయింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ లేచి నిలబడి సభ్యులందరికీ దండం పెడుతూ, సభను సజావుగా నడిచేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గందరగోళ పరిస్థితుల మధ్య అసెంబ్లీని ఆయన వాయిదా వేయడం గమనార్హం.