అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చించడానికి బదులు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల దూషణలనే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ సమావేశాలు కూడా అంతకు భిన్నంగా ఏమీ వుండే అవకాశాలు లేవు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్లకార్డులతో ప్రత్యక్షమైంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగనున్నాయో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ విషయమై అసెంబ్లీని స్తంభింపజేయాలని ప్రధాన ప్రతిపక్షం పట్టుదలతో వుంది. బాబు అరెస్ట్ అప్రజాస్వామికం, అన్యాయం అని చాటి చెప్పేందుకు అసెంబ్లీని వాడుకోవాలని టీడీపీ వ్యూహాత్మకంగా నడుచుకుంటోంది. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని కొందరు నేతలు అన్నప్పటికీ, మెజార్టీ సభ్యులు వ్యతిరేకించారు.
తమ గళాన్ని గట్టిగా వినిపించడానికి అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులు వెళ్లారు. అందులోనూ చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్లకార్డులు చేతపట్టుకుని వెళ్లి, అధికార పక్షాన్ని రెచ్చగొట్టినట్టవుతోంది. బాబు అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులను వివరించడానికి అధికార పక్షం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. బాబు అవినీతికి పాల్పడ్డారని నిరూపించేందుకు వైసీపీ అన్ని ఆధారాలతో సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు అసెంబ్లీలో రచ్చకు దిగే అవకాశాలున్నాయి.