మూడు రాజధానుల విషయంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. సిద్ధాంతపరంగా దీన్ని విశ్లేషించాలంటే రాజధానిని ఒక బంగారు బాతుగా చేసి, అది పెట్టే బంగారు గుడ్లు అమ్మి రాష్ట్రమంతా పోషించగలం అని టిడిపి అంటూండగా, గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదు కాబట్టి తలో చోటా గుడ్లు సర్దాలనే థియరీ వైసిపిది. ప్రస్తుతం వైసిపి నాయకులే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ల వాదన బలంగా వినిపిస్తున్నారు. టిడిపి వంతు వచ్చినపుడు వాళ్లు బంగారు బాతు వాదనను ఎంత ప్రతిభావంతంగా వాదిస్తారో చూడాలి. రెండూ విని మనం ఏదో ఒక దానితో ఏకీభవించవచ్చు. అఫ్‌కోర్స్, మన అభిప్రాయాన్ని ప్రభుత్వం పట్టించుకోదు. గతంలో రాజధానిని ప్రభుత్వభూములలో కడితే మంచిది కదా, ప్రయివేటు వ్యక్తుల దగ్గర్నుంచి తీసుకోవడం దేనికి అని మన లాటి వాళ్లు అభిప్రాయపడితే గతప్రభుత్వం పట్టించుకోలేదు. హైకోర్టు రాయలసీమకు తరలిస్తే తప్పు లేదు కానీ, ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌ను కూడా అమరావతి నుంచి తరలించవలసిన అవసరమేముందని మనం అభిప్రాయపడినా ప్రస్తుతప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
చంద్రబాబు బంగారు బాతు యిప్పటికే తయారైపోయిందన్నట్లు మాట్లాడుతున్నారు. అమరావతి బంగారుబాతు అనీ, మొత్తం రాష్ట్రాన్ని పోషించగల సామర్థ్యం ఉన్నదనీ, దాన్ని అనవసరంగా చంపేస్తున్నారనీ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనవన్నీ దీర్ఘకాలిక పథకాలు. అలాగే ఏ 2050 నాటికో అమరావతి బంగారుబాతు అవుతుందని అనుకున్నారు కానీ యిది యింకా 2020. అది యింకా బంగారు బాతు కాలేదు. గుడ్లు పెట్టటమూ లేదు. దాన్ని తయారుచేయడానికే బోల్డు ఖర్చు అవుతుందని బాబు మొన్నటిదాకా చెపుతూనే ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా అంకెలు కూడా చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా రాత్రికి రాత్రి దానిపై ఏ ఖర్చు పెట్టనక్కరలేదని, అది యిప్పటికే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనీ అంటున్నారు. దాని ఖర్చు అది రాబట్టుకుంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటారు. ఇంకోదానికి కూడా పెట్టుబడి పెట్టగల స్థాయి ఉంటేనే బంగరుబాతు అనాలి. ఓ సారి అది అంటారు, మరోసారి యిది అంటారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా అన్నీ అమరావతిలోనే పెట్టి దాన్ని డెవలప్ చేసి పెట్టుకుంటే రాష్ట్రానికి యిబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుస్తుందని హైదరాబాదుతో పోలిక పెట్టి చెప్పారు. ఇదే రాధాకృష్ణ కొన్ని వారాల క్రితం రాజధాని కావడానికి, అభివృద్ధికి సంబంధం లేదని వాదిస్తూ హైదరాబాదు శతాబ్దాలుగా రాజధానిగా ఉన్నా పెద్దగా అభివృద్ధి చెందలేదని, ఎన్టీయార్ హయాం నుంచే అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశారని రాశారు. అంటే రాజధానిగా అయిన ఎన్నాళ్లకు హైదరాబాదు రాష్ట్రంలోని యితర నగరాలకు ఆదాయం సమకూర్చగలిగింది? దాదాపు 30 ఏళ్లు. అమరావతికి కూడా అన్నేళ్లు పడుతుందని అనుకోవాలిగా! హైదరాబాదు 23 జిల్లాలకు రాజధాని. మరి అమరావతి 13 జిల్లాలకు! ఆ నిష్పత్తిలోనే ఆదాయమూ తగ్గుతుందిగా! అమరావతి నుంచి గత ఏడాది వచ్చిన ఆదాయం ఎంతో చెప్పమనండి.
రాజధానిని అమరావతి నుంచి మార్చకూడదని వాదించే వర్గాలు రకరకాల కథనాలను వండి వారుస్తున్నాయి. రాజధానిని అమరావతిలో కొనసాగించాలా, వైజాగ్‌కు మార్చాలా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. తప్పు లేదు. గతంలో కమిట్ అయిపోయాం కాబట్టి యిప్పుడు మార్చకూడదు అనే వాదన ఒకటి. వేరే చోట తక్కువ ఖర్చులో పని అయిపోతుంది కాబట్టి అక్కడకు మార్చేయడం మంచిది అనే వాదన మరొకటి. మధ్యలో రైతుల సమస్య వచ్చి చేరడంతో సెంటిమెంటల్ టచ్ వచ్చి చేరింది. 'రైతుల నుంచి భూమి తీసుకోలేదు, ప్రభుత్వభూముల్లోనే కట్టబోయారు, యిప్పుడు మారుద్దామనుకుంటున్నారు' అని ఊహించి ఆలోచించగలిగితే కాస్త స్పష్టత వస్తుంది. రాజధాని మార్పు విషయంలో కేంద్రం కలగజేసుకునేలా లేదు. కోర్టు మాత్రమే అడ్డుకోవాలి.
కానీ రాజధానిగా అమరావతి అనే అంశంలో బాబు అసెంబ్లీ తీర్మానం చేయలేదని, కాబినెట్ నిర్ణయాన్ని చదివి వినిపించడం మాత్రమే చేశారని, కేంద్ర గజెట్‌లో ప్రకటింప చేయలేదని, దానితో అమరావతికి రాజ్యాంగ రక్షణ లేకుండా పోయిందని కొందరంటున్నారు. అదే నిజమైతే రాజధాని మార్పును కోర్టు కూడా అడ్డుకోలేదు. ఇక రైతులను అడ్డుపెట్టుకుని మాత్రమే మార్పును అడ్డుకోవాలి. వైసిపి ఆర్థికభారం కారణం చూపి మార్పును సమర్థించుకుంటోంది. వైజగ్‌లో ప్రభుత్వభూముల్లోనే కట్టవచ్చని, ఉన్న భవంతులనే వాడుకుంటామని, అన్ని ఆఫీసులూ ఒకే చోట పెట్టం కాబట్టి, ఎక్కడ ప్రభుత్వభూములుంటే చూసుకుని అవి వాడుకుంటామని, తద్వారా రాజధాని నిర్మాణానికి వ్యయం తగ్గించి, ఆ నిధులను వేరేవాటికి మళ్లిస్తామని అంటోంది. మామూలుగా చూస్తే యీ వాదన సహేతుకంగా అనిపిస్తుంది.
దీన్ని తిప్పికొట్టడం కష్టం కాబట్టి, టిడిపి పార్టీ, దాని అనుకూల మీడియా, బిజెపిలోకి మారినా టిడిపి కొమ్ము కాస్తున్న నాయకుడూ వేరే పల్లవి ఎత్తుకున్నారు. ప్రస్తుత రాజధానిలో సర్వం సిద్ధంగా ఉందని, ఎకాయెకీ నడిపేయవచ్చని, ఖర్చేమీ ఉండదని, మారిస్తేనే ఖర్చవుతుందని కొత్త అంకెలు ప్రకటిస్తున్నారు. ఇది నాకు అర్థం కావటం లేదు. సదరు వ్యక్తులు మొన్నటిదాకా రాజధానికి లక్షల కోట్లు యింకా అవసరమౌతుందని, కేంద్రం యివ్వకుండా తొక్కిపెట్టిందని, అంతర్జాతీయ సంస్థల నుంచి ఋణం తీసుకోనివ్వలేదనీ తిట్టిపోస్తూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా ఏమీ అక్కరలేదంటున్నారేమిటి? అప్పుడు చెప్పినది అబద్ధమా? ఇప్పుడు చెప్పేది అబద్ధమా? మొన్నటిదాకా బాబు తను తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటేరియట్.. కట్టానని చెప్పుకుంటూ వచ్చారు. హఠాత్తుగా యిప్పుడు అవి శాశ్వత భవనాలు అయిపోయాయేమిటి?
'అన్ని హంగులతో రాజధాని' అంటూ జనవరి 2న ఈనాడు భవనాల బొమ్మలు, వాటి ఖర్చులు వేసింది. మొత్తమంతా కలిపితే వెయ్యి కోట్లు లేదు. ఇంతేనా రాజధాని? మరి అలా అయితే లక్షల కోట్లు కావాలని అడుగుతున్నా రెందుకు? ఎవరి కోసం? ఖర్చు పెట్టినది 6 వేల కోట్ల లోపున అని కొందరు, 7 పై చిలుకు అని కొందరు అంటున్నారు. దానిలో చాలా భాగం భూములు కలిపి, రోడ్లు వేయడానికి, దానికీ అయి వుంటుంది కదా! తక్కినదానిలో ఈ భవంతులు కట్టి వుంటారు. ఇవి చాలు, యింతకంటె ఏమీ అక్కరలేదు అంటే, మరి రైతుల గోడు మాటేమిటి? 'భూముల రేట్లు పడిపోయాయి. ఈ పరిస్థితిలోనే ఉంటే మాకు కేటాయించిన వాణిజ్య, నివేశన భూములకు విలువ ఏమీ ఉండదు. వాటిపై వచ్చిన అద్దెలతో బతుకుదామనుకున్న మా కలలు కల్లలయ్యాయి.' అని కదా! అన్ని హంగులతో రాజధాని అమరి వుండగా రేట్లు ఎందుకు పడిపోయాయిట? సర్వం సిద్ధంగా ఉండగా 62 ప్రాజెక్టులకై 53 వేల కోట్ల రూ.ల పనులకు బాబు ప్రభుత్వం టెండర్లు పిలిచి రూ.42 వేల కోట్ల టెండర్లను ఎందుకు ఫైనలైజ్ చేసిందట?
అన్నీ ఉన్నాయని ఈనాడు అంటూంటే మరుభూమిగా వదిలేసిన అమరావతిలో జిల్లేడు మ్కొలు మొలుస్తాయని, ఆంధ్రుల ఆరంభశూరత్వానికి మచ్చుగా ఆ నగరం మిగులుతుందని ఆంధ్రజ్యోతి రాసింది. ఇన్ని భవనాలుంటే జిల్లేడు ఎందుకు పెరుగుతుంది? అవి ప్రభుత్వభవనాలు. ప్రభుత్వ శాఖలను వేర్వేరు చోట్ల పెడతామంటున్నారు కాబట్టి వాటిలో కొన్నిటిని యీ భవంతుల్లో పెట్టవచ్చు. సెక్రటేరియటు అనే బోర్డు తీసేసి, వ్యవసాయ శాఖ లేదా నీటిపారుదల శాఖ అని బోర్డు మారిస్తే సరిపోతుంది. కొన్ని శాఖలు పెట్టగా మిగిలిపోయిన బిల్డింగులని ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అమ్మవచ్చు, అద్దెకు యివ్వవచ్చు. సంక్షేమ పథకాలకై నిధుల కోసం ప్రభుత్వభూములనే అమ్ముదామనుకుంటున్న ప్రభుత్వం, తన భవనాలను అమ్మలేదా? అలాటప్పుడు పెట్టిన ఖర్చంతా కృష్ణలో పోసినట్లు ఎందుకవుతుంది?
రాజధాని రాకపోతే, ఆ భవనాలు ఎవరు కొంటారు అని అడగకండి. రాజధానికి, ప్రయివేటు పెట్టుబడులకు సంబంధమే లేదు. 'ఫలానా ఊరు అభివృద్ధి చేస్తాం, మా పార్టీ నాయకులు అల్‌రెడీ ఆ పరిసరాల్లో భూములు కొనేశారు, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టడమే తరువాయి' అని ప్రభుత్వం చెప్పడం కాదు, పారిశ్రామికవేత్తలను పిలిచి 'మీ ఫ్యాక్టరీలకు అనువైన స్థలం ఏది? ఎక్కడ డెవలప్ చేయాలంటారు?' అని అడిగి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అమరావతి ప్రాంతానికి సహజంగా ఉంటే ఎడ్వాంటేజిలు ఉన్నాయి. విజయవాడ దగ్గరలోనే ఉంది. రవాణా సౌకర్యాలు, ప్రతిభ వున్న హ్యూమన్ రిసోర్సెస్, నేచురల్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. అందువలన అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పరిశ్రమలు తప్పకుండా ఉంటాయి. అలా వచ్చేవారు యికపై యిది 1/3 రాజధాని కదాని రావడం మానేయరు.
అమరావతి రాజధానిగా కొనసాగాలి అని వాదించేవారు 'రాజధాని ఒకే చోట లేకపోతే పెట్టుబడులు రావు. రాజధాని మారిస్తే పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయి' అంటున్నారు. ఆంధ్రకు పదేళ్ల వరకు హైదరాబాదు ఉమ్మడి రాజధాని అని 2014లో అనుకున్నారు. ఆంధ్రలో పెట్టుబడులు పెడదామనుకున్నవారు ఆంధ్రలోనే రాజధాని లేకపోతే పెట్టం అని చెప్పారా? తర్వాత కొన్ని కారణాల వలన బాబు అమరావతికి రాజధానిని మార్చారు. రాజధాని మార్చారు అని పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారా? అసలు రాజధానితో వాళ్లకు పనేముంది? ఫ్యాక్టరీ పెట్టడానికి ముందు అనుమతుల కోసం సెక్రటేరియట్‌కు వెళతారు, అదెక్కడ వుంటే అక్కడకి వెళతారు. ఆ తర్వాత సంబంధిత శాఖ ఎక్కడుందో అక్కడికే వెళతారు. కొన్నిటికి కేంద్రప్రభుత్వం అనుమతి యివ్వాలంటే దిల్లీ వెళతారు.
వికేంద్రీకరణ సిద్ధాంతం ప్రతిపాదిస్తూ, బాబు ప్రతిపాదించిన అద్భుతనగరం కాన్సెప్టును ఖండిస్తూ అసెంబ్లీలో బుగ్గన దీర్ఘప్రసంగం చేశారు. వలస పాలకులైన ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లు తమ వలసదేశాల్లో పన్నులు వసూలు చేసి వాటితో లండన్, పారిస్‌లను గొప్ప నగరాలుగా నిర్మించారని గుర్తు చేశారు. చరిత్ర పుస్తకాల్లో చదువుకోవడం వేరు, ఆ భవనాలను నేరుగా చూసినప్పుడు నాకూ అనిపించింది – యిదంతా మన డబ్బే కదా అని! ఎంతసేపూ కోహినూర్ గురించే మాట్లాడతాం కానీ శతాబ్దాల పాటు పన్నుల రూపంలో దోచినదాని గురించి మాట్లాడం. లండన్, పారిస్ నగరాల ఆదాయం మనకు రాలేదు కదా! సరి, అవి వేరే దేశాలు, మనల్ని బానిసలుగా పాలించారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతేమిటి? రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఆదాయమంతా హైదరాబాదులో కుమ్మరించారు. అందువలన హైదరాబాదులో కొండలకు, బండలకు కూడా డిమాండు వచ్చింది. తక్కిన 22 జిల్లాలలో అంతకంటె సౌకర్యాలున్న నగరాలలో, పట్టణాల్లో స్థలాలకు డిమాండ్ లేకుండా పోయింది.
ఆంధ్రప్రాంతంలో సమైక్య ఉద్యమానికి పెద్దగా మద్దతు రాకపోవడానికి కారణం ఇదే! 'రాష్ట్రం విడిపోతే యీ వైపున్న మన స్థలాలకు, ఆస్తులకు విలువ పెరుగుతుంది. హైదరాబాదు ఎటూ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది (ఆంధ్ర కాంగ్రెసు నాయకులు అలా నమ్మించారు) అది మన చేజారిపోదు. పైగా మనవైపు అభివృద్ధి జరుగుతుంది' అనుకున్నారు. అందుకే మొక్కుబడి ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఏర్పడగానే కెసియార్ ఆంధ్ర పెట్టుబడిదారులను తరిమివేస్తాడు, దెబ్బకి వాళ్లందరూ వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు, మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. చివరకు అవేమీ జరగలేదు.
రాష్ట్రం ఏర్పడగానే బాబు అమరావతిలోనే అంతా కుమ్మరిద్దామనుకున్నారు. తక్కిన ప్రాంతాలకు కడుపుమంట పుట్టింది. అమరావతి నయా హైదరాబాదు అవుతుంది. రేట్లు అక్కడే పెరుగుతాయి తప్ప మన దగ్గర పెరగవు అని. ఇప్పుడు రాజధాని ముక్కలవుతుంది, అభివృద్ధి కూడా వికేంద్రీకరింప బడుతుంది అనగానే తక్కిన ప్రాంతాల్లో ఖుష్. ఇప్పటిదాకా అనుకున్నది కోల్పోతున్నందుకు అమరావతిలో ఖేదం సహజం.
అద్భుతనగరం కాన్సెప్టుకి వ్యతిరేకంగా బుగ్గన మరో మంచి పాయింటు చెప్పారు. కృష్ణదేవరాయలు గొప్ప రాజు, విశాలమైన సామ్రాజ్యాన్ని పాలించినవాడు. ఆయన ఆదాయమంతా తన రాజధాని విజయనగరంలోనే ఖర్చు పెట్టకుండా, రాయలసీమలో చెరువులు తవ్వించి, రాష్ట్రమంతా సౌకర్యాలు కల్పించాడు. ఎవరూ ఎదురాడలేని రాజైనా తన కంటూ చిన్న భవంతి కట్టుకున్నాడు తప్ప రాజస్థాన్ రాజుల్లా మహళ్లు కట్టుకోలేదు. నాకు తెలిసి రాయలు భవంతి యింకా బయటపడలేదు, ఆయన రాణుల మేడ, లోటస్ మహల్ బయటపడ్డాయి. వాటి బట్టి యీయనది ఎంత ఉంటుందో ఊహించవచ్చు.
కన్నడంలో 'శ్రీకృష్ణదేవరాయ' అని బిఆర్ పంతులు రంగుల్లో సినిమా తీసినప్పుడు రాయలు ప్యాలెస్ ఘనంగా ఉండాలని రాజస్థాన్ మహళ్లలో షూట్ చేశారు. రాయలు రాజ్యసంపదను ప్రజల కోసం ఖర్చు పెట్టగా బాబు అమరావతిలో పాలక భవనాలను కళ్లు చెదిరే రీతిలో డిజైన్ చేయించారు. ఇప్పుడు కట్టిన సెక్రటేరియట్, అసెంబ్లీ ఒట్టి తాత్కాలికమే అంటూ శాశ్వత సెక్రటేరియట్, అసెంబ్లీలకై రూ.18 వేల కోట్ల టెండర్లు పిలిచారు.
బుగ్గన ప్రసంగంలో నన్ను ఆకట్టుకున్న మరో పాయింటు వికేంద్రీకరణ, రాజధాని నిర్ణయంపై వేసిన కమిటీల స్వరూపం గురించి! ఫజలాలీ కమిషన్, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలలో ఎటువంటి సభ్యులున్నారు, అర్బన్ ప్లానింగ్‌పై వాళ్లు ఎంతటి అథారిటీలు అనేది కళ్లకు కట్టినట్లు విశదీకరించి, చివర్లో బాబు వేసిన నారాయణ కమిటీలో సభ్యుల గురించి చెప్పినప్పుడు నవ్వు వచ్చింది. నారాయణ, సుజనా చౌదరి వంటి టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో (వీళ్లకు అమరావతిలో భూములున్నాయి) బాటు రియల్ ఎస్టేటు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు ఉన్నారు తప్ప అర్బన్ ప్లానింగ్‌పై నిష్ణాతులు ఎవరూ లేరు. బాబు ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా, ఆయన జిల్లాలు తిరుగుతూండగానే వేసిన నారాయణ కమిటీ రిపోర్టునే స్వీకరించింది. శివరామకృష్ణన్ కమిటీ కూడా వికేంద్రీకరణనే ప్రోత్సహించింది.
ఇవన్నీ వింటే వికేంద్రీకరణ ఎంత మంచిదో అనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌ను అమరావతి నుంచి ఎందుకు మార్చాలి అనేది మాత్రం వైసిపి సమర్థించుకోలేక పోతోంది. అక్కడ మౌలిక వసతులు లేవు, ఉన్న ఒకే రోడ్డులో రెండు కార్లకు మించి పక్కపక్కన వెళ్లే పరిస్థితి లేదు అని ఫోటోలతో సహా చూపించారు. జనాలు సెక్రటేరియట్‌కు రానక్కరలేకుండా చేస్తామంటున్నారు కాబట్టి అది పెద్ద సమస్యగా అనుకోనక్కరలేదు. అసెంబ్లీ అక్కడే వుంచుతామంటున్నారు కాబట్టి, ఆ సమస్య ఎలాగూ తీర్చాలి.
అమరావతిలో కానీ, వైజాగ్‌లో కానీ అద్భుతనగరం కట్టనక్కరలేదని తీర్మానించుకోవడం వరకు బాగుంది. అమరావతిలో అద్భుతనగరం కట్టనక్కరలేకుండా యిప్పటికే ఉన్న భవనాల్లో సెక్రటేరియట్, రాజభవన్ కొనసాగించి, తక్కినవి వైజాగ్‌కు తరలించవచ్చు. అప్పుడు జ్యుడీషియల్ కాపిటల్, లెజిస్లేటివ్ కాపిటల్ వంటి మాటల గారడీ అక్కరలేదు. వైజాగ్‌లో పెట్టదలచిన ఐదారు వేల కోట్ల ఖర్చే, అమరావతిలో పెట్టి ఊరుకోవచ్చు. అప్పుడు రాజధాని తరలిపోతోందని రైతుల్లో ఆందోళన కలగదు.
రైతుల నుంచి తీసుకున్న భూములను డెవలప్ చేసే బాధ్యత ఎలాగూ తప్పదు. లేకపోతే న్యాయస్థానాలు ఊరుకోవు. ఆ ఖర్చువలన రోడ్లు, పార్కులు ఎలాగూ అమరుతాయి. ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా అమరావతిని కొనసాగిస్తున్నారన్న తృప్తి అక్కడి జనాలకు ఉంటుంది. మేమనుకున్న అద్భుతనగరం వెలవటం లేదు, మా పెట్టుబడులకు తగిన రిటర్న్ రాలేదు అనే నిరాశ స్థలాలు కొన్నవారిలో ఉంటుంది కానీ దానికి ఎవరూ ఏమీ చేయలేరు. ఇక రైతుల గురించి ఆలోచిస్తే – వైసిపి ప్రభుత్వం చేస్తున్న తరలింపును వాళ్లు ఏ మేరకు అడ్డుకోగలరు? వారి చేతిలో ఉన్న ఆయుధాలేమిటి? అనే విషయంపై వచ్చే వ్యాసంలో చర్చిద్దాం. (సశేషం)
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2020)
[email protected]