రాజధాని అంటేనే రాజసం. అక్కడ దర్జా దర్పం విలాసం ఓ లెక్కలో ఉంటుంది. అక్కడ జరిగే అభివ్రుధ్ధి కూడా వేరేగా ఉంటుంది. అందుకే రాజధానులు కావాలంటూ పోరు పెడుతున్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి.
ఇకపోతే అమరావతి రాజధాని కమ్మరావతి అని భ్రమరావతి అని ఇంతవరకూ విమర్శలు విపక్షాల నుంచి, ప్రత్యేకించి వైసీపీ నుంచి రావడం జరిగింది. ఒక సామాజికవర్గం ఆధిపత్యం పెరిగిపోవడం వల్లనే అమరావతి ప్రజల రాజధాని కాలేదన్నది నిజం.
ఆ విషయం వైసీపీ నేతలు ఎక్కువగా చెబుతూ ప్రజా రాజధానిగా అమరావతి ఎప్పటికీ కాలేదని కూడా కామెంట్స్ చేసారు. సరే ఇపుడు విశాఖను అతి ముఖ్యమైన పాలనా రాజధానిగా చేస్తున్నారు.
దీని మీద టీడీపీ అభ్యంతరం పెడుతోంది. అయితే దానికి సమాధానంగా అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని విశాఖ కూడా మన రాజధానే అంటూ టీడీపీ ఎందుకు దీని మీద అడ్డుచెపుతోందని అనడం విశేషం.
విశాఖలో ఉన్నది, అభివ్రుధ్ధిలో భాగమైనది నూటికి 80 శాతం కమ్మవారేనని ఆయన అనడం విశేషం. విశాఖలో వ్యాపార, వాణిజ్య రంగాలన్నీ కమ్మ వారి చేతుల్లోనే ఉన్నాయని కూడా నాని చెప్పుకొచ్చారు.
పైగా అక్కడ నుంచి వరసగా విశాఖ ఎంపీలుగా గెలిచిన వారి పేర్లు చదువుతూ ఎంవీవీఎస్ మూర్తి, దగ్గుబాటి పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు, ఎంవీవీ సత్యనారాయణ వంటి వారంతా కమ్మ వారు కాదా అని నాని ప్రశ్నించడం కూడా విశేషం.
కమ్మవారికి ఇపుడు రెండు రాజధానులు, వాటిని ఎందుకు వద్దంటున్నారని ఆయన టీడీపీని నిగ్గదీశారు. జగన్ కే మమకారం, కులాభిమానం ఉంటే కనుక రాయలసీమకే రాజధానిని పట్టుకెళ్ళేవారు కదా అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కమ్మవారికి రెండు రాజధానులు ఈ మొత్తం వికేంద్రీకరణలో దక్కడం రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఏపీలో వారి బలమేంటో చెప్పకనే చెబుతోంది.