విజయ్ దేవరకొండ కు బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకూ ఒక్క హిందీ సినిమాలో నటించకపోయినా అర్జున్ రెడ్డి హీరో పట్ల అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే అర్జున్ రెడ్డి సినిమాను హిందీలోకి డబ్ చేసుకుని అక్కడ జనాలు చూశారు. కబీర్ సింగ్ పేరుతో హిందీలో ఆ సినిమా రీమేక్ అయినా, మళ్లీ తెలుగు వెర్షన్ ను హిందీలోకి డబ్ చేసుకున్నారు.
ఆ సంగతలా ఉంటే.. తెలుగులో అంతగా ఆడని డియర్ కామ్రేడ్ పట్ల కూడా హిందీ జనాల్లో మంచి ఆసక్తి కనిపిస్తూ ఉంది. తాజాగా ఆ సినిమాను హిందీలోకి అనువదించి, యూట్యూబ్ లో విడుదల చేశారు. థియేటరికల్ రిలేజ్ కు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకుండా యూట్యూబ్ లో విడుదల చేసే సరికి ఈ సినిమాకు ఎనలేని ఆసక్తి కనిపిస్తూ ఉంది.
ఎంతలా అంటే.. విడుదల అయిన 24 గంటల్లోనే ఈ సినిమా యూట్యూబ్ లో 11 మిలియన్ల వ్యూస్ ను పొందింది. డియర్ కామ్రేడ్ భారీ అంచనాల మధ్యన విడుదల అయిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలను అందుకోలేక ఆ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు హిందీ వెర్షన్ ఒక్క రోజులో కోటీ పది లక్షలకు పైగా వ్యూస్ ను పొందడం ఆసక్తిదాయకం.