ఓవైపు చారిత్రక మూడు రాజధానుల అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఈ బిల్లు ప్రవేశపెట్టడం కోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేశారు. మరోవైపు టీడీపీతో పాటు ఇతర విపక్షాలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనను ఉధృతం చేశాయి. వీటితో తనకు సంబంధం లేనట్టుగా పవన్ కల్యాణ్ తిరిగి ముఖానికి రంగేసుకున్నారు. మరోసారి కెమెరా ముందుకొచ్చారు.
ఎలాంటి ప్రకటన చేయకుండా, మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు పవన్. ఈరోజు నుంచి పింక్ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో 'జనసేన అధ్యక్షుడు' పాల్గొన్నారు. హైదరాబాద్ లోని అల్వాల్, ఓల్డ్ బోయిన్ పల్లి మధ్యలో పవన్ పై కొన్ని సన్నివేశాలు తీశారు.
ఈ సినిమా కోసం అన్నపూర్ణ ఏడెకరాల స్టుడియోస్ లో కోర్టు సెట్ వేశారు. ఇక్కడే పవన్ తో షూట్ స్టార్ట్ అవుతుందని అంతా భావించారు. వందల సంఖ్యలో పవన్ అభిమానులు కూడా ఈరోజు పొద్దున్న స్టుడియో ముందు గుమిగూడారు. కానీ పవన్ మాత్రం అల్వాల్-ఓల్డ్ బోయిన్ పల్లి మధ్య ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఉదయం 8 గంటలకే లొకేషన్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 అయ్యేసరికి ప్యాకప్ చెప్పారు.
ఈరోజు సన్నివేశంలో పవన్ పై మాంటేజ్ షాట్స్ మాత్రమే తీశారు. అతడికి ఎలాంటి డైలాగ్స్ ఇవ్వలేదు. అంతేకాదు, బయట ఉన్న గడ్డంతోనే సినిమాలో కూడా ఉన్నారు పవన్. గడ్డంతో తీయాల్సిన షాట్స్ పూర్తయిన తర్వాత క్లీన్ షేవ్ లోకి మారతారు. త్వరలోనే “అన్నపూర్ణ”లో షూటింగ్ ఉంటుంది.
ఇక తొలి రోజే లీకుల పర్వం మొదలైంది. అవుట్-డోర్ షూటింగ్ కావడంతో లొకేషన్ లో పవన్ నడుస్తున్నప్పుడు ఎవరో ఫొటో తీశారు. ఆ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ మూవీకి లాయర్ సాబ్ అనే టైటిల్ అనుకుంటున్నారు.