ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటుచేస్తూ ప్రవేశపెట్టిన కీలకమైన అధికార-అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఇకపై శాసనరాజధానిగా అమరావతి, పాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయి. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో, బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎప్పట్లానే డ్రామాలు ఆడారు. చివరికి స్పీకర్ 13 మంది టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది.
బిల్లుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, రాజధానులకు సంబంధించి అనేక అంశాలను టచ్ చేశారు. పనిలోపనిగా చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీల్ని గతంలో చంద్రబాబు ఎలా వక్రీకరించారనే విషయాన్ని సభలో వీడియోలు చూపించి మరీ వివరించారు జగన్.
“3 పంటలు పండే పొలాల్లో, సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామాల్లో రాజధానిని పెట్టారు చంద్రబాబు. అటు విజయవాడ, ఇటు గుంటూరుకు ఎంతో దూరంలో ఉన్న గ్రామాల్లో రాజధానిని పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజధాని గ్రామాల నోటిఫికేషన్ రాకముందు మాత్రమే ఈ భూముల కొనుగోళ్లు జరిగాయి. ప్రజలెవరికీ తెలియదు. అంతా వాళ్లే కొనుక్కున్నారు. రైతుల నుంచి తక్కువకు కొనేసి రైతుల్ని ముంచేశారు. అలా 4070 ఎకరాలు కొన్నారు. ఇందులో చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ కూడా ఉంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ.”
రాజధానికి ఏఏ గ్రామాలు ఎంత దూరంలో ఉన్నాయో మ్యాప్ పెట్టి మరీ చూపించారు ముఖ్యమంత్రి. మరీ ముఖ్యంగా రాజధానికి వెళ్లాలంటే కరకట్ట నుంచి వెళ్లాలని, పక్కపక్కనే 2 వాహనాలు కూడా వెళ్లలేని కరకట్టను రాజధానికి రాజమార్గంగా చూపించారని ఎద్దేవా చేశారు. పైగా వరద ముంపు ఉన్న ప్రాంతమని, అలాంటి ప్రాంతాన్ని కావాలనే రాజధానిగా చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి.
రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలంటూ చంద్రబాబు చేసిన వాదనల్లో అర్థం లేదన్నారు జగన్. టేపు పెట్టి కొలిచి రాజధానిని ఏర్పాటుచేయాల్సిన అవసరం లేదన్నారు. పైగా పెట్టుబడిలో పదో వంతు పెడితే అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి చెందే లక్షణాలు విశాఖకు ఉన్నప్పుడు ఎందుకు అవకాశాన్ని వాడుకోకూడదని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే 3 రాజధానులు ఏర్పాటుచేస్తున్నామన్నారు.
మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ ఆందోళనలకు సిద్ధమయ్యాయి. ఈరోజు తమ కార్యాచరణను ప్రకటించబోతున్నాయి. అటు ఈ బిల్లును ఈరోజు శాసనమండలిలో ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం.