దాదాపుగా తెలుగు హీరోలందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సినిమా నిర్మాణంలోకి దిగుతున్నారు. తమ సినిమాలు మాత్రమే కాకుండా, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మించే కార్యక్రమం చేపడుతున్నారు.
ఇప్పుడు ఈ లైన్ లోకి హీరో నాగశౌర్య కూడా వచ్చి చేరాడు. ఇప్పటికే నాగశౌర్య హీరోగా సినిమాలు నిర్మించేందుకు అతని అమ్మ..నాన్న ఓ బ్యానర్ స్టార్ట్ చేసారు. ఐరా క్రియేషన్స్ అనే బ్యానర్ కింద ఇప్పటికే మూడు సినిమాలు నిర్మించి, నాలుగో సినిమాకు శ్రీకారం చుట్టారు.
ఇప్పుడు ఆ బ్యానర్ అలా వుండగానే వేరే కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు, కొత్త హీరోలను పరిచయం చేసేందుకు ఓ కొత్త బ్యానర్ ను ఐరా సినిమాస్ అనే పేరుతో స్టార్ట్ చేసారు.
ఈ బ్యానర్ కింద నిర్మించే తొలి థ్రిల్లర్ సినిమాకు సన్నీ కోమాలపాటి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో ఎవరు కీలకపాత్రలు పోషించబోతున్నారన్నది త్వరలో తెలియచేస్తారు.
ఈ కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన సందర్భంగా ఉష మాల్పూరి, శంకర్ ప్రసాద్ మాల్పూరి మాట్లాడుతూ ఈ కొత్త బ్యానర్ మీద కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తూ, వరుసగా సినిమాలు నిర్మిస్తామన్నారు. తమతో పాటు నటుడు , పారిశ్రామిక వేత్త అభినవ్ సర్దార్ సహ నిర్మాతగా వ్యవహారిస్తారన్నారు.