కేటీఆర్ కామెంట్స్‌తో ర‌గిలిపోతున్నారు?

చంద్ర‌బాబు అరెస్ట్‌, అనంత‌ర ప‌రిణామాల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్‌పై టీడీపీ నేత‌లు ర‌గిలిపోతున్నారు. ఎల్లో మీడియా ఒక అడుగు ముందుకేసి… “మా సామాజిక వ‌ర్గం మీకు ఓట్లు వేయ‌దు. కాంగ్రెస్‌కు వేయ‌డానికి డిసైడ్…

చంద్ర‌బాబు అరెస్ట్‌, అనంత‌ర ప‌రిణామాల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్‌పై టీడీపీ నేత‌లు ర‌గిలిపోతున్నారు. ఎల్లో మీడియా ఒక అడుగు ముందుకేసి… “మా సామాజిక వ‌ర్గం మీకు ఓట్లు వేయ‌దు. కాంగ్రెస్‌కు వేయ‌డానికి డిసైడ్ అయిపోయాం పో” అనే రేంజ్‌లో వార్నింగ్‌లు ఇస్తోంది.

చంద్ర‌బాబు అరెస్ట్ తీవ్ర రాజ‌కీయ దుమారానికి తెర‌లేచింది. బాబు అరెస్ట్‌పై తెలుగు స‌మాజం అంతా ఆగ్ర‌హంతో ర‌గిలిపోయి నిర‌స‌న‌ల‌కు దిగిన‌ట్టు ఓ ఫిక్చ‌ర్ ఇచ్చేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో టీడీపీ అనుకూల సాప్ట్‌వేర్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. దీనిపై అక్క‌డి ప్రభుత్వం కేసు న‌మోదు చేసింది.

తాజాగా బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ చేప‌ట్టే ర్యాలీల‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

“ఏపీ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం. ఏపీలో రెండు పార్టీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రుగుతోంది. ఇక్కడ ర్యాలీలు చేయ‌డం ఎందుకు? అవి ఏవైనా ఏపీలో చేసుకోమ‌నండి. రాజ‌మండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌డానికి విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి లేవా? అక్క‌డికి వెళ్ల‌మ‌నండి. ఏ సంబంధం లేని, ప్ర‌శాంతంగా జీవిస్తున్న హైద‌రాబాద్‌లో నిరసనలు చేప‌డితే ఊరుకునేది లేదని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం” అని కేటీఆర్ హెచ్చ‌రించారు.  

కేటీఆర్ కామెంట్స్ ఇటు టీడీపీ, అటు వైసీపీల‌ను దృష్టిలో పెట్టుకుని చేశారు. కానీ టీడీపీ మాత్ర‌మే ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంది. కేటీఆర్‌పై టీడీపీ అనుకూల మీడియా విమ‌ర్శ‌లు చేస్తోంది. రెండు నెల‌ల్లో జ‌రిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయాల‌ని టీడీపీ శ్రేణులు అనుకున్నాయ‌ని, కానీ కేటీఆర్ కామెంట్స్‌తో వారంతా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు నిర్ణ‌యించుకున్నార‌ని ఎల్లో మీడియా అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతోంది.

కేటీఆర్ కామెంట్స్ బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా న‌ష్టం తెస్తాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోవైపు వైసీపీ మాత్రం బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతోంది. కేటీఆర్ మాట‌ల్లో త‌ప్పేం ఉంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌శాంత న‌గ‌ర‌మైన హైద‌రాబాద్‌లో ఏపీ కంపు రాజ‌కీయాలు ఎందుక‌ని కేటీఆర్ ప్ర‌శ్నించ‌డంలో త‌ప్పు ప‌ట్టేది ఏముంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.