మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మోడీ సర్కారు తీసుకువచ్చిన మహిళా బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చడంలో కీలకమైన ఘట్టం పూర్తయినట్టే. ఆబిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. అక్కడ కూడా నిస్సందేహంగా ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ.
అయితే మహిళా బిల్లు చట్ట రూపం దాల్చిన అంత మాత్రాన ఆ ఆనందం అనుభవంలోకి రావాలంటే మహిళా సమాజం మరికొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు, జన గణన పూర్తిచేసే వరకు దీనిని అమలులోకి తేలేం అని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
మోడీ సర్కారు చేసిన ఈ ప్రకటన మీదనే విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడో 2029 నాటికి మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించేట్లయితే.. ఇప్పటి ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తక్షణం బిల్లును ఆమోదించవలసిన అవసరం ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమలులోకి తీసుకురావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు కూడా. నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. అమలు విషయంలో అనుసరిస్తున్న ధోరణి వలన అధికార పార్టీ విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.
లోక్సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ నిర్వహించినప్పుడు సభలో మొత్తం 456 మంది సభ్యులు ఉండగా, 454 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. మజిలీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన పార్టీకే చెందిన ఔరంగాబాద్ ఎంపీ ఇద్దరూ దీనిని వ్యతిరేకించారు. అసదుద్దీన్ ఓవైసీ గతంలో త్రిపుల్ తలాక్ రద్దు బిల్లును కూడా వ్యతిరేకించిన అందరికీ గుర్తుండే ఉంటుంది.
ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసిన తీరును గమనిస్తే మహిళల్లో తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే 30 ఏళ్లుగా అమలులోకి రాలేకపోయిన ఆలోచనను, చట్ట రూపంలోకి తేగలుగుతున్నందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.
గతంలో కాంగ్రెస్ హయాంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ, లోక్ సభలో తీవ్రమైన నిరసనలు ప్రతిఘటనల మధ్య ఓటింగ్ జరగకుండా ఆగిపోయింది. అయితే ఆ బిల్లును పూర్తిగా పక్కనపెట్టి.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమదైన శైలిలో సరికొత్త బిల్లును తీసుకువచ్చింది. ఇప్పటికీ ఈ బిల్లులో ఉన్న చిన్న చిన్న లోపాలను అవసరమైతే సవరిస్తామని అమిత్ షా చెబుతున్నారు.
మొత్తానికి చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం మరో ఐదేళ్ల తర్వాత అయినా.. గణనీయంగా పెరగబోతోంది. అంది వచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటే గనుక రిజర్వుడు సీట్లు 33శాతమే అయినా, 50 శాతం వరకు మహిళా ప్రతినిధులే ఉండడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది.