జ‌గ‌న్ లంచ్ భేటీకి నేనూ వెళ్లాల్సింది…కానీ!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి లంచ్ భేటీ ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది. సీఎం జ‌గ‌న్‌కు టాలీవుడ్ అగ్ర‌ హీరోలు చిరంజీవి, నాగార్జున అత్యంత స‌న్నిహితులు. సీఎంను క‌లిసేందుకు అన్ని వేళ‌లా చిరు,…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి లంచ్ భేటీ ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది. సీఎం జ‌గ‌న్‌కు టాలీవుడ్ అగ్ర‌ హీరోలు చిరంజీవి, నాగార్జున అత్యంత స‌న్నిహితులు. సీఎంను క‌లిసేందుకు అన్ని వేళ‌లా చిరు, నాగార్జున క‌లిసే వెళుతుంటారు. ఇవాళ మాత్రం నాగార్జున లేకుండా చిరంజీవి ఒక్క‌డే విజ‌య‌వాడ వెళ్ల‌డంతో స‌హ‌జంగానే నాగార్జున ప్ర‌స్తావ‌న సోష‌ల్ మీడియాలో వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో బంగార్రాజు ప్ర‌మోష‌న్‌లో భాగంగా గురువారం నాగార్జున మీడియాతో మాట్లాడారు. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. తాను కూడా చిరంజీవితో పాటు లంచ్ భేటీకి వెళ్లాల్సి వుండింద‌న్నారు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో నెల‌కున్న స‌మ‌స్య‌ల‌పై చిరు, తాను క‌లిసి అప్పుడ‌ప్పుడు మాట్లాడుకుంటున్న‌ట్టు చెప్పారు. 

వారం క్రితం చిరంజీవి త‌న‌కు ఫోన్ చేసి సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌బోతున్న‌ట్టు చెప్పార‌న్నారు. త‌న‌ను కూడా ఆహ్వానించార‌న్నారు. అయితే నాగ‌చైత‌న్య‌తో క‌లిసి తాను న‌టించిన బంగార్రాజు సినిమా ప్ర‌మోష‌న్స్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండ‌డంతో జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వీలు కాద‌ని చెప్పాన‌న్నారు.

జ‌గ‌న్‌తో చిరంజీవికి స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని నాగార్జున గుర్తు చేశారు. త‌న ఒక్క‌డి కోసం జ‌గ‌న్‌ను క‌లిసేందుకు చిరంజీవి వెళ్లలేద‌ని ఆయ‌న స్ప‌ష్ట‌త ఇచ్చారు. కావున సీఎంతో చిరు భేటీ వ‌ల్ల అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. తండ్రీత‌న‌యులు న‌టించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి బ‌రిలో దిగ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఏపీ ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల మేర‌కు సినిమా టికెట్ల ధ‌ర‌ల‌తో బంగార్రాజు సినిమాకు ఇబ్బందేమీ లేద‌ని మ‌రోసారి కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు ఆయ‌న చెప్పారు. మ‌రొక సినిమాకు ఆ ధ‌ర‌లు వ‌ర్కౌట్ కాక‌పోవ‌చ్చ‌న్నారు. ఒక‌వేళ సినిమా టికెట్ల రేట్లు పెరిగితే త‌మ‌కు బోన‌స్ వ‌చ్చిన‌ట్టే అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సినిమా ఆడ‌క‌పోతే చేసేదేమీ లేద‌న్నారు. దాని కోసం సినిమా విడుద‌ల చేయ‌కుండా ఉండ‌లేన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.