ఆనందయ్యకు ఫైనల్ వార్నింగ్ పడింది. ఆయన దుకాణం క్లోజ్ చేయాల్సిన టైమ్ వచ్చిందనే సిగ్నల్స్ బలంగా కనిపిస్తున్నాయి. చివరాఖరిగా ఆయుష్ విభాగం నుంచి కూడా నోటీసులు రావడంతో ఆనందయ్య పూర్తిగా కార్నర్ అయ్యారని అర్థమవుతోంది.
సెకండ్ వేవ్ లో ఆనందయ్య పేరుని అందరూ కలవరించారు, ఆనందయ్యను దేవుడిలా భావించారు. రాజకీయ నాయకులు కూడా ఆనందయ్యపై ఒత్తిడి తెచ్చి మరీ మందు తయారు చేయించుకుని వెళ్లారు. సీన్ కట్ చేస్తే.. ఏడాది తిరిగేలోగా ఆనందయ్య వ్యవహారం మొత్తం తారుమారైంది. ఒమిక్రాన్ వేరియంట్ కి కూడా మందు నా దగ్గర ఉంది అని ఆనందయ్య చెప్పడమే పెద్ద తప్పు అయింది.
ఒమిక్రాన్ లక్షణాలేవీ వైద్యులకి కూడా సరిగ్గా తెలియవు కదా, ఆనందయ్య మందు ఏంటి అని అందరూ ఆరా తీశారు. గతంలో కాస్తో కూస్తో వినిపించిన విమర్శలు ఇప్పుడు తీవ్రతరం అయ్యాయి. ప్రభుత్వం నుంచి కానీ, స్థానిక నాయకుల నుంచి కానీ మద్దతు లేకపోవడంతో ఆనందయ్య ఒంటరి అయ్యారు.
ఉన్న ఊరిలోనే మద్దతు కరవు..
ఆనందయ్యకు సొంత ఊరు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలోనే మద్దతు కరవైంది. ఆనందయ్య మందు పంపిణీకి వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఆ తర్వాత కలెక్టర్ నుంచి నోటీసులు వెళ్లాయి.
ఒమిక్రాన్ కి మందు తయారు చేస్తుంటే, దానిపై వివరణ ఇవ్వాలన్నారు. దీంతో ఆనందయ్య న్యాయపోరాటం మొదలు పెట్టారు. మరోసారి కోర్టు మెట్లెక్కారు. కోర్టులో కేసు విచారణలో ఉండగానే.. తాజాగా ఆయుష్ శాఖ నుంచి మరో నోటీసు వచ్చింది.
తయారీకే అనుమతి లేదు.. మళ్లీ పంపిణీయా..?
ఆయుర్వేద మందులు ఎవరు పడితే వారు తయారు చేయకూడదు, వాటిని పంపిణీ చేయకూడదని అంటోంది ఆయుష్ శాఖ. ఆయుష్ శాఖ అనుమతితోనే ఆయుర్వేద వైద్యులు.. ఇతరులకు వైద్యం చేయడం కానీ, మందులు ఇవ్వడం కానీ చేయాలి. కానీ ఆనందయ్యకు ఆయుష్ నుంచి అనుమతి లేదు. గతంలో సెకండ్ వేవ్ సమయంలో కోర్టు సూచనతో ఆనందయ్య మందుని పరిశీలించి దాని పంపిణీకి అడ్డంకుల్లేవని స్పష్టం చేశారు ఆయుష్ విభాగం అధికారులు.
తాజాగా మరోసారి ఒమిక్రాన్ మందు అనే సరికి మరింత నిఘా పెట్టారు. ఒమిక్రాన్ మందు మందు పంపిణీకి అనుమతి లేదని, అసలు ఆనందయ్యకు మందు తయారీకే అనుమతి లేదని స్పష్టం చేశారు. నిజంగా ఒమిక్రాన్ కి మందు కనిపెట్టి ఉంటే, తమ అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా మందు పంపిణీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆనందయ్య అంతర్థానమేనా..?
ఓ దశలో ఆనందయ్యను నెత్తిన పెట్టుకున్న స్థానిక మీడియా కూడా ఇప్పుడు ఆయనకు పబ్లిసిటీ ఇవ్వడం లేదు. పైపెచ్చు.. ఆయనపై పూర్తిగా వ్యతిరేక కథనాలు కూడా వెలువడుతున్నాయి.
ఆనందయ్య పరార్ అంటూ ఈరోజు హెట్టింగ్ పెట్టి దినపత్రికలో వార్త వచ్చింది. ఈ దశలో అసలు ఆనందయ్య ఏం చేస్తారు..? మరోసారి కోర్టు మెట్లెక్కుతారా..? లేక పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోతారా..? అనేది తేలాల్సి ఉంది.