శాసనసభలో తమకు బలం లేకపోయినా వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకుంటామంటూ తెలుగుదేశం వాళ్లు లీకులు ఇస్తూ ఉన్నారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీని ప్రజలు 23 సీట్లతో నిలబెట్టారు. వారిలోనూ ఇద్దరు తిరుగుబాటు చేశారు. మిగిలినది చంద్రబాబుతో సహా 21 మంది. వారిలో ఎంతమంది చంద్రబాబు వెంట నిలుస్తారో ఎవరికీ తెలియదు.
ఆ సంగతలా ఉంటే.. శాసనసభ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ శాసనసభ్యుల సమావేశంలో ఆసక్తిదాయకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది కీలకమైన సమయంగా చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. అమరావతిని కాపాడుకోవాలని తెగ ఇదైపోతూ ఉన్నారు. ఈ పరిణామాల మధ్యన నిర్వహించిన తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశానికి ఏకంగా 10మంది ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం గమనార్హం.
వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం పెడితే..దాన్ని మండలిలో అడ్డుకుంటామంటూ తెలుగుదేశం వాళ్లు ప్రకటించుకుంటున్నారు. అయితే ఏకంగా పది మంది ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడంతో.. వారిలో ఎంతమంది తెలుగుదేశం పార్టీతో ఉన్నట్టో, ఎవరు దూరం అయినట్టో అంతుబట్టని పరిస్థితి ఏర్పడింది ఆ పార్టీ వాళ్లకు.
మండలిలో తమకు మెజారిటీ ఉందని ప్రకటించుకున్నా.. ఇప్పుడు ఆ మండలి సభ్యులే దూరం అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత ఇరకాటంలో పడుతుంది. అలాగే ఈ శాసనసభా పక్ష భేటికి కొత్తగా మరో ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు తో సహా టీడీపీ పక్షాన ఉన్న వారిలో ఐదు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి గైర్హాజరు అయినట్టుగా సమాచారం.