మండలిలో తిప్పికొట్టి ఏం సాధిస్తారు?

పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఇవాళ శాసనసభ ముందు ప్రవేశ పెట్టనుంది. అధికార పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉన్న నేపథ్యంలో బిల్లు సభ ఆమోదం పొందడం…

పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఇవాళ శాసనసభ ముందు ప్రవేశ పెట్టనుంది. అధికార పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉన్న నేపథ్యంలో బిల్లు సభ ఆమోదం పొందడం పెద్ద విషయం కాదు. కానీ.. తెలుగుదేశం పార్టీ దీనిని అడ్డుకోవడానికి తమ వంతు వ్యూహరచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

శాసనసభలో తెలుగుదేశానికి ఉన్న బలం కేవలం 21 మాత్రమే. ఇద్దరు సభ్యులు ఆ పార్టీకి దూరంగా ఉండడంతో.. బలం ఇలా పడిపోయి ఉంది. ఆ బలంతో వారు బిల్లును అడ్డుకోవడం అనేది అసాధ్యం. కాకపోతే.. శాసనమండలిలో తమకు సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నది గనుక… బిల్లును అడ్డుకోవాలని తెదేపా వ్యూహరచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ వాస్తవంలో మండలిలో బిల్లును తిప్పికొట్టినా కూడా… వారికి ఒరిగేది ఏమీ ఉండదని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మండలిలో ఒక బిల్లును తిరస్కరించినా, లేదా సవరణలు ప్రతిపాదించినా… లేదా మూడునెలల పాటూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వదిలేసినా.. సదరు బిల్లు మళ్లీ అసెంబ్లీ ఎదుటకు వస్తుంది. సవరణలను ఆమోదించినా ఆమోదించకపోయినా.. అసెంబ్లీ తాము గతంలో పాస్ చేసిన బిల్లును మళ్లీ మరోసారి పాస్ చేసి చట్టంగా మార్చేయవచ్చు. కానీ చట్టంరూపు దాల్చడం కొంత ఆలస్యం కావొచ్చు.

ఇలాంటి సాంకేతిక కారణాలను వాడుకుని అధికార వికేంద్రీకరణ బిల్లును డిలే చేయడానికి తెదేపా కుయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నింపాదిగానే ఉంది.