మెగాస్టార్ చిరంజీవితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇవాళ మధ్యాహ్నం లంచ్ భేటీ సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెగాస్టార్ చిరుతో పాటు ఆయన తమ్ముడు పవన్‌పై కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
జనసేనతో తాను వన్‌సైడ్ లవ్ కొనసాగిస్తున్నానని, పవన్‌కల్యాణ్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే తాను ఏం చేయాలని చంద్రబాబు కాసింత అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా మైండ్ గేమ్ అంటూ పవన్‌కల్యాణ్ తనదైన రీతిలో పార్టీ శ్రేణులతో అన్న సంగతి తెలిసిందే.
టీడీపీ డిజిటల్ ఈ-పేపర్‌ను ప్రారంభించిన సందర్భంగా చిరుతో తన బంధం గురించి చంద్రబాబు సానుకూల వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు, ఆ తర్వాత ఇప్పుడు కూడా తమ మధ్య స్నేహ సంబంధాలున్నాయన్నారు. అలాగే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకుండా ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదని బాబు నొచ్చుకున్నారు.
చిరంజీవి తన స్నేహితుడే అని బాబు చెప్పిన రెండు రోజులకే…ఏపీలో ఆయన ప్రత్యర్థి జగన్ ఏకంగా చిరుతో లంచ్ భేటీ కానుండడం విశేషం. చిరంజీవితో తనదే అసలుసిసలు ఆత్మీయ సంబంధం అని తమ కలయిక ద్వారా ఓ సందేశాన్ని జగన్ పంపనున్నారనే చర్చ జరుగుతోంది. తద్వారా చంద్రబాబు రాజకీయ ఎత్తుగడను ఒక్క లంచ్ భేటీతో జగన్ దెబ్బ తీశారనే చర్చకు తెరలేచింది.
గతంలో కూడా చిరంజీవి దంపతులు జగన్ ఇంటికి లంచ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో చిత్రపరిశ్రమతో వివాదం నెలకున్న నేపథ్యంలో సీఎంతో చిరు భేటీ టాలీవుడ్‌కు ఆశలు రేకెత్తిస్తోంది. తాను సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండనని, బిడ్డగా తన వంతు బాధ్యతగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిరు అన్న సంగతి తెలిసిందే. తాజా భేటీతో ఇండస్ట్రీ సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందనే టాలీవుడ్ ఆశలు వమ్ము కావద్దని కోరుకుందాం.