విద్యారంగంలో విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు మరో ముందడుగు వేశారు. తన మాతృగడ్డ రుణాన్ని తీర్చుకునేందుకు మోహన్‌బాబు విద్యా ఫలాలను మరింతగా పంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన పేరుతోనే తిరుపతిలో విశ్వవిద్యాలయం నెలకొల్పనున్నారు. ఈ సంగతిని తనే ట్విటర్ వేదికగా సగర్వంగా వెల్లడించారు.
తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ)ని నెలకొల్పనున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే పలు విశ్వవిద్యాల యాలతో తిరుపతి ఎడ్యుకేషన్ హబ్‌గా నిలిచింది. తాజాగా మోహన్‌బాబు యూనివర్సిటీ ఏర్పాటుతో ప్రైవేట్ రంగంలో నెలకొల్పినట్టు అవుతోంది.
తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్, వెటర్నరీకి సంబంధించిన ఉన్నత విద్యా సంస్థలున్నాయి. తెలుగు వారి మొదటి పండుగ సంక్రాంతి ముంగిట ఆనందంతో మోహన్‌బాబు ట్వీటర్ వేదికగా చెప్పిన మంచి మాట ఏంటో చూద్దాం.
“శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు పెరిగి కల్పవృక్షాలయ్యాయి. 30 ఏళ్ల మీ నమ్మకం, వినూత్నంగా విద్యనందించాలనే నా జీవిత ఆశయం ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరింది. మీ కోసం తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. మీ ప్రేమే నా బలం. మీ సహకారం కొనసాగుతుందని నేను బలంగా నమ్ముతున్నా” అని మోహన్‌బాబు ట్వీట్ చేశారు.