యూపీ బీజేపీలో ప్రకంపనలు పుట్టిస్తున్న స్వామి ప్రసాద్ మౌర్యపై అరెస్టు వారెంటు జారీ కావడం ఆసక్తిదాయకంగా మారింది. ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే 2014 నాటి కేసులో అరెస్టు వారెంట్ జారీ కావడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. హిందూ దేవుళ్లను అవమానపరిచాడనే అభియోగాలతో అప్పట్లో బీఎస్పీలో ఉన్న స్వామి ప్రసాద్ మౌర్యపై కేసులు నమోదయ్యాయి.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. పెళ్లి తంతులో వినాయకుడు, గౌరీ పూజలు చేయనక్కర్లేదు, అగ్రకులాల వాళ్లు నిమ్న కులాలపై ఆధిపత్యంలో భాగంగానే ఇలాంటివి వచ్చాయి.. అంటూ స్వామి ప్రసాద్ మౌర్య 2014లో వ్యాఖ్యానించారట. ఇది హిందూ దేవుళ్లను అవమానపరిచడమే అంటూ ఆయనపై కొంతమంది ఫిర్యాదులు చేశారప్పట్లో. ఆ కేసులు అలాగే ఉంటూ వచ్చాయి.
మరి హిందూ దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన స్వామి ప్రసాద్ మౌర్యకు ఆ తర్వాతి కాలంలో బీజేపీ పెద్ద పీట వేసింది. 2017లో బీజేపీలో చేరిన ఆయనకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది! ఆయన కూతురుకు ఎంపీ టికెట్ దక్కింది!
మామూలుగా ఎవరైనా వేరే వాళ్లు ఈ మాటలు మాట్లాడి ఉంటే.. అతడినో తీవ్రవాదిగా చిత్రీకరించే వారు భక్తులు. అయితే స్వామి ప్రసాద్ వెనుక ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకుని, హిందూ దేవుళ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనకే చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. ఇప్పుడు ఆయన బీజేపీని విమర్శిస్తూ బయటకు వెళ్లిన కొన్ని గంటల్లోనే 2014 నాటి వ్యాఖ్యలపై అరెస్టు వారెంటు జారీ అయ్యింది!
వాడెవరైనా సరే.. బీజేపీలో ఉంటే పునీతుడు, బయటకు వెళితే పాపాత్ముడు.. అనే నియమం కొన్నేళ్లుగా చలామణి లో ఉందనే అభిప్రాయాలు బలంగా ఉండటంతో, ఇప్పుడు అరెస్టు వారెంట్ అంశం కూడా రాజకీయ చర్చకు కారణం అవుతూ ఉంది.