టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన టీఆర్ఎస్లోనే ఉంటానని ప్రకటిస్తున్నా …. ఆ మాటలు అంత నమ్మశక్యంగా లేవనే అభిప్రాయాలు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ మారే వాళ్లంతా ఇలా “కాదు కాదు” అంటూనే …ఒక్కసారిగా జంప్ చేయడం ఎంతో మందిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డి బీజేపీలో చేరిక ఖాయమనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకు నేందుకు బీజేపీ చురుగ్గా పావులు కదుపుతోంది.
ఎలాగైనా గ్రేటర్ హైదరాబాద్లో పాగా వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గట్టి ఫైట్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆ జోష్తో గ్రేటర్ ఎన్నికల్లో మరింత దూకుడుగా వెళ్లాలని ఆ పార్టీ నిశ్చయించుకున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీకి మొట్ట మొదట షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. త
నపై పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్లోకి చేర్చుకోవడంతో పాటు మంత్రి పదవి కూడా కట్టబెట్టడంతో తీగల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
మహేశ్వరం నియోజకవర్గంలో తన ప్రాధాన్యం ఏమీ లేకపోవడంతో అధికార పార్టీలో ఉన్నా లేనట్టైందని సన్నిహితుల వద్ద ఆయన వాపోతు న్నట్టు ప్రచారం జరుగుతోంది.
దీంతో ఆయన టీఆర్ఎస్ కార్యకలాపాలకు కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. గతంలో హైదరాబాద్ మేయర్గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తోంది.
తనను కోరుకుంటున్న పార్టీలోకి వెళ్లడం మంచిదని తీగల ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డితో బీజేపీ సీనియర్ నేతలు జరిపిన చర్చల ఫలితం ఏంటనేది ఒకట్రెండు రోజుల్లో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.