రాజ‌ధానిపై జ‌న‌సేన ఎమ్మెల్యేది జ‌గ‌న్ బాటే

జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావుది రాజ‌ధాని విష‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ బాటే. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు జ‌గ‌న్ స‌ర్కార్ నేడు అసెంబ్లీ వేదిక‌గా కీల‌క నిర్ణ‌యం…

జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావుది రాజ‌ధాని విష‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ బాటే. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు జ‌గ‌న్ స‌ర్కార్ నేడు అసెంబ్లీ వేదిక‌గా కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష టీడీపీలో కూడా అధినేత చంద్ర‌బాబు అమ‌రావ‌తిలోనే అన్నీ కొన‌సాగించాల‌నే నిర్ణ‌యాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్య‌తిరేకిస్తున్నారు. విశాఖ‌లో ప‌రిపాల‌న రాజ‌ధాని ఏర్పాటును ఆహ్వానిస్తూ విశాఖ టీడీపీ ఇప్ప‌టికే తీర్మానం చేసింది. 

అసెంబ్లీలో జ‌న‌సేన‌కు ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక  ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌నే డిమాండ్‌పై ఆందోళ‌న‌లు కూడా చేస్తున్నాడు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక మాత్రం “ఒక‌టి వ‌ద్దు…మూడు రాజ‌ధానులు ముద్దు” అని నిన‌దిస్తున్నాడు. నేటి నుంచి మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాల‌ను పుర‌స్క‌రించుకుని ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

 ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానని ఆయన అన్నాడు. రాష్ట్రంలోని 13 జిల్లాలు స‌మానంగా అభివృద్ధి చెందాల‌ని, అందుకోసం ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాడు.  మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్‌ జరిగితే దానికి మద్దతుగానే తాను ఓటు వేస్తానన్నాడు.