జగన్ తీసుకుంటున్న నిర్ణయంపైన స్పందించాల్సింది రాజకీయ పార్టీలు కాదు. ఎందుకంటే ఎవరి అజెండా వారికి ఉంది, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వారికి ఉన్నాయి. మరి రియాక్ట్ అవాల్సింది ఎవరు, ఎవరు చెబితే సబబేనన్న భావన జనంలో కలుగుతుంది అనుకుంటే తటస్థులు, మేధావులు అన్న మాట వస్తుంది. ఈ వర్గం మాత్రం జగన్ చేస్తున్నది కరెక్ట్ అని గట్టిగానే అంటున్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదన ద్వారా ఏపీలో జగన్ కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నారని కూడా అంటున్నారు. భవిష్యత్తులో ఇది దేశంలోనే ఒక మోడల్ అయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.
ఇపుడు దేశంలో ఎక్కడ చూసినా ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకువస్తున్నాయి. అటువంటి వాటికి తావు లేని విధంగా జగన్ పాలనా వికేంద్రీకరణకు నాంది పలుకుతున్నారని కూడా అంటున్నారు. ఒకపుడు దేశంలో పద్నాలుగు రాష్ట్రాలే ఉండేవని, పాలన పెద్ద రాష్ట్రాల్లో అందకనే అవి వేరుపడేందుకు పోరాటాలు చేస్తూ ఇప్పటికి 28 అయ్యాయని గుర్తు చేస్తున్నారు.
ఇక ఒకప్పుడు సమితులు ఉండేవని, తరువాత కాలంలో మండలాల వ్యవస్థ వచ్చిందని కూడా చెబుతున్నారు. ఇపుడు మూడు రాజధానుల కాన్సెప్ట్ కూడా కొత్త విప్లవమేనని అంటున్నారు.మాడు టీడీపీ సమితులు పెడుతున్నపుడు వద్దు, కాదు అని అరచిన వారే తరువాత కాలంలో సర్దుకున్నారని కూడా గుర్తు చేస్తున్నారు.
సమితులు అయితే ఒక నియోజకవర్గం కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉండేవి, దాంతో ఎమ్మెల్యే కంటే కూడా పవర్ ఫుల్ గా సమితి ప్రెసిడెంట్ ఉండేవారు. దాంతో తమ పెత్తనం పోతుందన్న దురుద్దేశంతోనే సమితుల రద్దుని నాడు పెత్తందార్లు అడ్డుకున్న సంగతి చరిత్రలో ఉంది.
ఇదిలా ఉండగా విశాఖలోని ప్రజా సంఘాలు, మేధావులు కూడా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన భేష్ అంటున్నారు. దీని వల్ల ఫ్యూచర్లో ఏపీ మరింతగా అభివ్రుధ్ధి సాధించడమే కాకుండా ప్రాంతీయ భేదాలు కూడా ఉండవని అంటున్నారు.
పాలనా, రాజకీయ, అధికార, న్యాయ వికేంద్రీకరణ సంపూర్ణంగా జరగాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అంటే ఒక్కచోట పాలన నడుపుతూ ప్రజలను తమ చుట్టూ తిప్పించుకోవడం కానే కాదని ఆయన చెబుతున్నారు.
కేవలం రాజధానులు మాత్రమే కాదు, ప్రభుత్వ ఆఫీసులను, హైకోర్టులను కూడా మూడు నాలుగు బెంచులుగా చేసి గ్రామ స్థాయివరకూ అటు పాలనను, ఇటు న్యాయపాలనను తీసుకువెళ్తేనే అసలైన పాలన జనాలకు అందుతుందని ఆయన చెబుతున్నారు.
అదే విధంగా విశాఖ వంటి నగరాన్ని రాజధాని చేసుకోమని శివరామక్రిష్ణ కమిటీ గతంలో ఎనిమిది పేజీల నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చిందని మాజీ వీసీ ప్రొఫెసర్ కేఎస్ చలం గుర్తు చేశారు. ఇపుడు మూడు రాజధానులతో ఉత్తరాంధ్రాను వీడిన పదిహేను లక్షల వలస జీవులు తిరిగి వెనక్కివస్తారని ఆయన అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే విశాఖ సహా మూడు రాజధానులు బెస్ట్ కాన్సెప్ట్ అని మేధావులు ప్రజాసంఘాల నేతలు కితాబు ఇస్తున్నారు.