ఒక్కో సారి మనసులో అనుకున్నవి వాటంతటవే జరిగిపోతుంటాయి. ఇది కలా? నిజమా? అనే అనుమానం కూడా కలుగుతుంది. అలాంటిదే ప్రముఖ నటి రేణూదేశాయ్ విషయంలో ఓ మధురానుభూతి కలిగించే అనుభవం ఎదురైంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె షేర్ చేసే విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా, ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి. మనం కూడా ఇలా చేస్తే బాగుంటుందే అనే ఫీలింగ్ ఆమె యాక్టివిటీస్ చూస్తే కలిగే భావన.
తాజాగా రేణూదేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కటి అనుభూతిని పంచుకున్నారు. రేణూదేశాయ్‌కి పల్లెలంటే బాగా ఇష్టం. ఎప్పుడెప్పుడు పల్లెలకు వెళ్లి గడుపుదామా అని ఆమె మనసు ఉవ్విళ్లూరుతుంటోందట. పట్టణాల్లో ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ జామ్ తదితర వాటి నుంచి దూరంగా…పల్లెల్లో పచ్చదనం మధ్య ఉల్లాసంగా ఉత్సాహంగా తిరగాలని ఆమె ఎప్పటి నుంచో అనుకుంటోందట. ఇటీవల తన కోరిక అనుకోకుండా తీరిందంటూ…అందుకు సంబంధించిన గమ్మత్తైన విషయాలను నెటిజన్లతో పంచుకున్నారామె.
సినిమా షూటింగ్ ముగించుకొని ప్రొడక్షన్ డిజైనర్‌తో కలిసి ఓ మారుమూల గ్రామం మీదుగా హైదరాబాద్‌కు కారులో ప్రయాణిస్తుండగా.. డిజైనర్‌తో తనకు అప్పుడే హైదరాబాద్ వెళ్లిపోవాలని లేదని చెప్పిందట రేణూ దేశాయ్. ఆమె చెప్పిన కాసేపటికే కారు టైర్ పంక్చర్ అయ్యిందట. ఇదే మంచి సమయం అనుకుని కారు దిగి నేరుగా సమీపంలోని గ్రామస్తులను రేణూ కలిశారట. రేణూను చూడగానే గ్రామీణుల ఆనందానికి అవధుల్లేవట. వాళ్లకు తినడానికి లేకపోయినా తనకు ఉప్మా, టీ ఇచ్చారని సంతోషంగా తెలిపారామె.
అంతేకాదు చలిగా ఉండటంతో మంట కూడా వేశారని తెలిపారు. ఆ రాత్రి గ్రామీణ పిల్లలతో కలిసి నిద్రపోయానని, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. చలికి మంట వద్ద కూర్చున్న వీడియో తదితర విషయాలను రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఈ సందర్భంగా రేణూ పోస్ట్ చేసిన మెసేజ్ చాలా గొప్పగా ఉంది. “మన దగ్గర ఎంత డబ్బుండీ ఏం లాభం. దాన్ని దానం చెయ్యడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ వాళ్లు తమ దగ్గర ఏమీ లేకపోయినా మనకు ఎన్నో ఇచ్చారు. వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది” అని ఆ గ్రామీణ పేదల గొప్పదనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రేణు దేశాయ్.