జనసేనలో ప్రజాస్వామ్యం.. అదెక్కడుంది పవన్?

“పొత్తులపై జరుగుతున్న మైండ్ గేమ్ లో పావులు కావొద్దు. పొత్తుల కంటే సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. నేను ఒక్కడ్ని తీసుకునే నిర్ణయం మీద ముందుకెళ్లం. పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరి ఆమోదయోగ్యమైన ఆలోచనతోనే ముందుకెళ్దాం.”…

“పొత్తులపై జరుగుతున్న మైండ్ గేమ్ లో పావులు కావొద్దు. పొత్తుల కంటే సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. నేను ఒక్కడ్ని తీసుకునే నిర్ణయం మీద ముందుకెళ్లం. పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరి ఆమోదయోగ్యమైన ఆలోచనతోనే ముందుకెళ్దాం.”

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజా స్టేట్ మెంట్ ఇది. ఇది ఎవరికైనా నమ్మశక్యంగా ఉంది అంటే కచ్చితంగా అది పవన్ కల్యాణ్ వీరాభిమానులకే.

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, ఎవరి మాటయినా చెల్లుబాటు అవుతుందనుకోవడం అపోహే. అలా చెల్లుబాటయ్యే మాటే ఉంటే.. జనసేన పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ మేధావులంతా పార్టీని వీడేవారు కాదు. పోయేవారంతా పవన్ ఓవర్ యాక్షన్ ని తిట్టిపోసి బయటకు వెళ్లిపోయారు. నాదెండ్ల మనోహర్ కి ఎక్కడా అవకాశం లేక పవన్ తో కలసి ఉంటున్నారు కానీ, ఆ పార్టీ బాగు పడుతుందని ఆయనతో పాటు, పవన్ కోటరీలో ఉన్న ఏ ఒక్కరికీ ఏ కోశానా నమ్మకం లేదంటే అతిశయోక్తి కాదు.

ఆటలో పావులే అంతా..

ఇప్పటివరకు పొత్తులపై ఎప్పుడూ కార్యకర్తల అభిప్రాయం తీసుకోలేదు పవన్. ఈసారి మాత్రం ప్రజాస్వామ్యం, అందరి ఆమోదం అంటూ కలరింగ్ ఇస్తున్నారు. తొలిసారి పార్టీ పెట్టినప్పుడు టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చారు. ఆ తర్వాత టీడీపీతో తెగతెంపులు. ఆ వెంటనే బీజేపీతో దోస్తీ. ఇప్పుడేమో మరోసారి టీడీపీ వైపు చూపు. ఏ దశలోనూ కార్యకర్తల ఆలోచనలు, వాళ్ల మనోభావాల్ని లెక్కలోకి తీసుకోలేదు. 

గతంలో క్షేత్రస్థాయిలో టీడీపీతో కలవడానికి జనసైనికులు చాలా ఇబ్బంది పడ్డారు. విడిపోయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు బీజేపీతో కూడా తప్పదన్నట్టు రాసుకుపూసుకు తిరుగుతున్నారు. ఈ అంశంపై ఒక్క రోజు కూడా కార్యకర్తల అభిప్రాయం తీసుకోలేదు పవన్. ఇప్పుడేమో పార్టీలో ప్రజాస్వామ్యం అంటూ కలరింగ్ ఇస్తున్నారు.

మెంటల్ ప్రిపరేషన్ తో రెడీ..

2024 నాటికి పవన్ టీడీపీతో కలసి వెళ్తారనేది బహిరంగ రహస్యం. అయితే ఆ కూటమిలో బీజేపీ ఉంటుందా లేదా అనేది డౌట్. కానీ పవన్ మాత్రం ఇప్పటినుంచే కార్యకర్తల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. 

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. కనీసం సగానికి సగం సీట్లు త్యాగం చేయాలి, మధ్యలో టీడీపీతో కూడా కలిస్తే ఇక జనసేన సోలోగా పోటీ చేసే స్థానాల సంఖ్య వేళ్లమీద లెక్కబెట్టుకోవచ్చు. గెలిచే సీటు తనకి ఒక్కటి ఇచ్చి, మిగతావి ఏం చేసుకున్నా పర్లేదు అనుకునే రకం పవన్ కల్యాణ్.

అందరూ త్యాగరాజులే..

పవన్ కల్యాణ్ ఓపెన్ డిస్కషన్ పెట్టి, నిజాయితీగా అభిప్రాయాలు చెప్పండి అంటే.. జనసైనికుల్లో ఏ ఒక్కరూ పొత్తుల బేరం కావాలని చెప్పరు. కష్టమో, నష్టమో, గెలుపో ఓటమో.. సొంతంగా తేల్చుకోవాలనుకుంటున్నారు జనసేన నాయకులు, కార్యకర్తలు. ఇప్పటికే కాస్తో కూస్తో జనాల్లోకి వెళ్తున్నారు. రెండేళ్ల ముందుగానే మంచి ప్లాట్ ఫామ్ వేసుకుంటున్నారు. ఈ దశలో పవన్ పొత్తులపై హింట్ ఇచ్చారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నా.. చివరకు ఆయన ఏం చేస్తారో అందరికీ తెలుసు.

అందుకే ఎందుకొచ్చిన తంటా అంటూ అధినాయకుడిదే నిర్ణయం అంటూ ఏకవాక్య తీర్మానానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. “పొత్తులు పెట్టుకుంటా, అది నా ఇష్టం” అని పవన్ చెబితే అప్పుడు ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో జనసైనికులు పొత్తులు కోరుకుంటున్నారు అనే వంకతో.. నెపాన్ని కార్యకర్తలపై నెట్టి టీడీపీకి దగ్గరైతే మాత్రం అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు.