40% టికెట్లు వార‌సుల‌కా? యువ‌త‌కా?

రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త‌కు పెద్ద పీట వేయనున్న‌ట్టు టీడీపీ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏకంగా 40% టికెట్లు యువ‌త‌కు కేటాయించ‌నున్న‌ట్టు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ్యూహాత్మ‌క ప్ర‌క‌ట‌న వెనుక రాజ‌కీయ…

రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త‌కు పెద్ద పీట వేయనున్న‌ట్టు టీడీపీ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏకంగా 40% టికెట్లు యువ‌త‌కు కేటాయించ‌నున్న‌ట్టు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ్యూహాత్మ‌క ప్ర‌క‌ట‌న వెనుక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. యువ ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునే ఎత్తుగ‌డ‌లో భాగంగా 40% టికెట్ల కేటాయింపు ప్ర‌క‌ట‌న చేశార‌ని చెప్పొచ్చు.

నిజానికి ఈ 40% ప్ర‌క‌ట‌న‌తో ఒక విష‌యంలో టీడీపీ స్ప‌ష్ట‌త ఇచ్చింది. టీడీపీ వార‌సుల‌కు టికెట్లు కేటాయించ‌నున్న‌ట్టు సంకేతాలు ఇచ్చారు. త‌మ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల పిల్ల‌ల‌కు టికెట్లు ఇచ్చి, అదే యువ‌త‌కు కేటాయించామ‌నే బిల్డ‌ప్ ఇవ్వ‌డానికి టీడీపీ త‌న మార్క్ వ్యూహాన్ని ర‌చించింది. తిమ్మిని బ‌మ్మి.. బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌ల నేర్ప‌రిత‌నం టీడీపీ సొంతం. యువ‌త‌కు టికెట్ల కేటాయింపు విష‌యంలోనే అదే చేయ‌బోతోంది.

వార‌సుల‌ను కాద‌ని, కొత్త‌గా ఒక్క టికెట్ కూడా ఇత‌రుల‌కు ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని సొంత పార్టీ నేత‌లు అంటున్నారు. చంద్ర‌బాబు త‌న వార‌సుడు లోకేశ్‌కు బ‌ల‌మైన కోట‌రీని ఏర్పాటు చేసే క్ర‌మంలో వార‌సుల పిల్ల‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌ని స‌మాచారం. 

ఇప్ప‌టికే య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే గౌతు శిరీష‌, ప‌రిటాల సునీత కుమారుడు శ్రీ‌రామ్‌, ప్ర‌తిభా భార‌తి కుమార్తె గ్రీష్మ‌, శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు …త‌దిత‌రులను యువ‌త‌గా చూపేందుకు టీడీపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. వీళ్లంద‌రిలో లోకేశ్ యువ‌త‌కు అతిపెద్ద రోల్ మోడ‌ల్‌గా జ‌నానికి చూప‌డానికి టీడీపీ డ్రామాకు తెర‌లేప‌నుంది. అయితే రాజ‌కీయ పార్టీల నినాదాలు, విధానాలు తెలియ‌నంత అమాయ‌క స్థితిలో జ‌నం లేర‌ని గ్ర‌హించాల్సి వుంది.