వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తు పూర్తికి డెడ్‌లైన్‌

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తు ముగింపున‌కు ఎట్ట‌కేల‌కు సీబీఐ ఒక తేదీ ఇచ్చింది. ద‌ర్యాప్తు న‌త్త‌తో పోటీ ప‌డుతూ సాగుతుండ‌డంపై సుప్రీంకోర్టు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.…

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తు ముగింపున‌కు ఎట్ట‌కేల‌కు సీబీఐ ఒక తేదీ ఇచ్చింది. ద‌ర్యాప్తు న‌త్త‌తో పోటీ ప‌డుతూ సాగుతుండ‌డంపై సుప్రీంకోర్టు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. చివ‌రికి ద‌ర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను మార్చాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మ‌రోవైపు సీబీఐ ద‌ర్యాప్తు వేగం మంద‌గించ‌డంపై డాక్ట‌ర్ సునీత కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే.

సుప్రీంకోర్టు ఆగ్ర‌హం నేప‌థ్యంలో సీబీఐ వివేకా హ‌త్య కేసు ముగింపున‌కు ముందుకొచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ నాటికి ద‌ర్యాప్తును పూర్తి చేస్తామ‌ని సుప్రీంకోర్టుకు సీబీఐ విన్న‌వించింది. అంత‌కు ముందు విచార‌ణ అధికారిపై ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. విచార‌ణ అధికారి రామ్‌సింగ్‌ను కొన‌సాగిస్తామ‌ని సుప్రీంకు సీబీఐ విన్న‌వించింది. అందుకు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎంఆర్ షా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ఇంత కాలం ద‌ర్యాప్తులో ఎలాంటి పురోగ‌తి సాధించ‌ని అధికారిని కొన‌సాగిస్తామ‌న‌డంలో అర్థం లేద‌ని ధ‌ర్యాస‌నం పేర్కొంది. దీంతో మ‌రో అధికారి పేరును సీబీఐ ప్ర‌తిపాదించింది. ద‌ర్యాప్తు అధికారిని మారుస్తున్న నేప‌థ్యంలో కేసు విచార‌ణ‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని, కావున త‌న భ‌ర్త‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి భార్య తుల‌శ‌మ్మ న్యాయ‌స్థానాన్ని అభ్య‌ర్థించారు. బెయిల్‌పై మ‌ధ్యాహ్నం 2 గంట‌ల త‌ర్వాత‌ ఉత్త‌ర్వులు ఇస్తామ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది